Begin typing your search above and press return to search.

పన్నీర్ ఔట్.. ఫళని విన్.. వెనుక మోడీనేనా?

By:  Tupaki Desk   |   10 Oct 2020 12:30 AM GMT
పన్నీర్ ఔట్.. ఫళని విన్.. వెనుక మోడీనేనా?
X
అన్నాడీఎంకేలో చెలరేగిన ఆధిపత్య పోరు టీకప్పులో తుఫాను చల్లబడింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో అధికార అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ముఖ్యమంత్రి ఫళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలు పొడచూసి చివరకు రెండుగా చీలిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలో పరిస్థితులు చేయిదాటిపోయాయి.

ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వంలోని కీలక మంత్రి ఒకరు.. ప్రధాని నరేంద్రమోడీని కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇక లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న అన్నాడీఎంకే మాజీ ఎంపీ తంబిదురై కూడా ఢిల్లీలో బీజేపీ వర్గాలను కలిసినట్టు ప్రచారం సాగింది.

ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థి వ్యవహారంపై ప్రతిష్టంభన తొలగిందని.. చర్చలు జరిగాయని.. ఈ విషయంలో మోడీ ఎంట్రీ ఇచ్చి అన్నాడీఎంకేలో వర్గపోరుకు చెక్ పెట్టారని టాక్. అన్నాడీఎంలో రెండు చీలిపోకుండా మోడీ కాపాడారని.. ఇన్నాళ్లుగా తమకు అనుకూలంగా ఉన్న ఫళని స్వామినే తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా మోడీ చక్రం తిప్పారని వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఎం అభ్యర్థిత్వం విషయంలో ఇన్నాళ్లుగా మొండిగా ఉన్న పన్నీర్ సెల్వం ఓ మెట్టు దిగి ఫళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఖచ్చితంగా మోడీనే ఇదంతా చేశాడని అంటున్నారు.

మొత్తంగా తమ మిత్రపక్షం అన్నాడీఎంకేలోనూ మోడీ రాజకీయం చేస్తున్నాడని.. తమిళనాట వచ్చే ఎన్నికలపై మోడీ బీజేపీ దృష్టి సారించిందని అంటున్నారు.