Begin typing your search above and press return to search.

మోడీతో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తొలగింది

By:  Tupaki Desk   |   21 Nov 2016 7:30 PM GMT
మోడీతో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తొలగింది
X
వినటానికి చిత్రంగా అనిపించినా ఇది నిజం. తోపుల్లాంటి ముఖ్యమంత్రులకు సైతం సాధ్యం కానిది ప్రధాని మోడీ పుణ్యమా అని హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ఒక పరిష్కారం దొరికిపోయింది. దశాబ్దాల తరబడి హైదరాబాదీయుల్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే.. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బృహత్ ప్రణాళిక ఒకటి సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతారు కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు.

అయితే.. ప్రధాని మోడీ పుణ్యమా అని ఇప్పటికైతే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య సెట్ అయిపోయింది. మోడీ ఏమిటి?.. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించటం ఏమిటన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన తీసుకున్న పెద్దనోట్లను రద్దు నిర్ణయంతో హైదరాబాద్ ట్రాఫిక్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. చేతుల్లో డబ్బుల్లేని హైదరాబాదీయులు బయటకు రావటం బాగా తగ్గించేశారు.

వీకెండ్ అయితే చాలు షాపింగ్..ఈటింగ్.. అవుటింగ్ అంటూ బయటకు వచ్చేసే వారంతా గప్ చిప్ అయిపోయారు. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే..జేబులో నుంచి డబ్బులు తీయాలి. పర్సులో ఉన్న కాసిన్ని డబ్బులు అయిపోతే.. మళ్లీ డబ్బుల కోసం బ్యాంకుల వద్దా.. ఏటీఎం సెంటర్ల వద్దా పడిగాపులు కాయాల్సిన దుస్థితి. డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లి.. గంటల తరబడి క్యూలో నిలుచునే శిక్ష వేయించుకునే కన్నా.. డబ్బుల్ని వీలైనంత తక్కువగా ఖర్చు పెట్టే క్రమంలో.. ఇంట్లో నుంచి రావటమే తగ్గించేశారు.

దీంతో.. హైదరాబాద్ ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం చూపింది. అదెంత అంటే.. గతంలో గంట పాటు పట్టే ప్రయాణం ఇప్పుడు.. 45 నిమిషాలకు తగ్గిపోయింది. రద్దీ వేళలో ఇంత భారీగా ప్రయాణం తగ్గిపోయిందంటే.. రోడ్ల మీద జనాలు రాకపోవటంతో వాహనాలు యమా స్పీడ్ గా దౌడు తీస్తున్నాయి. ఇంకా ఎవరికి ఐడియా రాన్నట్లుంది కానీ.. పెద్దనోట్ల రద్దు కారణంగా తగ్గిపోయిన ట్రాఫిక్ తో.. ఎంత వాయు కాలుష్యాన్ని మోడీ తగ్గించారన్న లెక్కలు వేసి వాట్సప్ లలో పోస్ట్ లు చేయటం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/