Begin typing your search above and press return to search.

ఆ దేశంలో మోడీ గ్రాఫ్ దూసుకెళుతోంది

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:57 AM GMT
ఆ దేశంలో మోడీ గ్రాఫ్ దూసుకెళుతోంది
X
సేఫ్ గేమ్.. సేఫ్ గేమ్ అనుకుంటాం కానీ.. ఆచితూచి అడుగులు వేద్దామనుకునే జాగ్రత్తలో శత్రువుకి మనం ఎలా కనిపిస్తామన్నది దాయాది పాకిస్థాన్ మన పట్ల వ్యవహరించే ధోరణిని చూస్తే అర్థమవుతుంది. ఆ దేశం విషయంలో జోక్యం చేసుకోకున్నా.. ఏదో విషయానికి మనల్ని కెలుకుతూ.. దేశంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఆ దేశం చేసే చేష్టలు అన్నిఇన్ని కావు. అలాంటి దేశాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది ప్రధాని మోడీ లాంటి వ్యక్తికి బాగా తెలుసన్న విషయం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామల్ని చూస్తే అర్థమవుతుంది.

కశ్మీర్ లో పాక్ జెండా ఎగిరినప్పుడు సగటు భారతీయుడి ఒళ్లు ఎంత మండుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కశ్మీర్ పై పాక్ కు ఎలాంటి హక్కు లేకున్నా.. కేవలం తన స్వార్థ బుద్ధితో భారత్ లో కలకలం రేపేందుకు ప్రయత్నించే పాక్ కు ఒళ్లుమండేలా.. ఒంటికి కారం పూసుకున్నట్లుగా చేయటంలో మోడీ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

పాక్ పై న్యాయ పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ పౌరుల విషయాన్ని మోడీ ప్రస్తావించటమే కాదు.. పాక్ సైన్యం.. ప్రభుత్వం చేసే దుర్మార్గాల గురించి గళం విప్పిన మోడీ పుణ్యమా అని అంతర్జాతీయ సమాజాం ఒక్కసారి బలూచిస్తాన్ పై మరోసారి దృష్టి సారించింది. ఈ పరిణామం పాక్ కు ఒళ్లు మండేలా చేస్తే.. తమ హక్కుల కోసం పోరాడుతున్న బలూచ్ ప్రజలకు సంతోషంగా మారింది. అక్కడ ప్రజల్లో మోడీ ఇమేజ్ భారీగా పెరిగింది. దశాబ్దాల తరబడి తాము చేస్తున్న పోరాటానికి భారత ప్రధానిగా ఉన్న మోడీ మద్దతు ప్రకటించటంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

బలూచిస్తాన్ కు చెందిన పలువురు నేతలు బహిరంగంగా మోడీకి థ్యాంక్స్ చెప్పటమే కాదు.. పాక్ కు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మోడీకి ధన్యవాదాలు చెప్పిన ఐదుగురు బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాట నాయకులపై పాక్ దేశద్రోహం కేసులు పెట్టింది. దీంతో.. అక్కడ ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. ఇదెంత పెరిగిందంటే.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచ్ పౌరులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు. భారత జాతీయ పతకాలు పట్టుకొని వీధుల్లోకి రావటమే కాదు.. పాక్ జెండాల్ని కింద పడేసి కాళ్లతో తొక్కేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా బూలచిస్తాన్ లోని పలు ప్రాంతాల్లోఆందోళనలు తీవ్రతరమయ్యాయి. మోడీ సహకారం అందిస్తే బంగ్లాదేశ్ మాదిరి బలూచిస్తాన్ కూడా స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవిస్తుందని అక్కడి ఆందోళనకారులు కోరుకుంటున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో మోడీ ఇమేజ్ బలూచిస్తాన్ లో భారీగా పెరిగిపోవటమే కాదు.. ఆయన్ను విపరీతంగా అభిమానిస్తూ.. ఆయనపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కాస్త ధైర్యంతో ఒకడుగు ముందుకు వేస్తే శత్రువును ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. మన మీద ఫోకస్ ను తగ్గించే వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.