Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ నేతల్ని చూసి మోడీ అడిగిందేమిటి?

By:  Tupaki Desk   |   11 Sep 2016 5:48 AM GMT
ఏపీ బీజేపీ నేతల్ని చూసి మోడీ అడిగిందేమిటి?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరింగ్ తో బీజేపీ అగ్రనాయకత్వం అలెర్ట్ అయింది. ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ స్నేహాన్ని మాత్రమే చూసిన వారికి.. పవన్ తో రాజకీయ శత్రుత్వం ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. కాకినాడ సభ పూర్తి అయిన వెంటనే.. ఏపీ కమలనాథుల్ని అర్జెంట్ గా ఢిల్లీకి రావాలంటూ కబురు పెట్టారు.

ఇలాంటి అనుభవాలు తక్కువగా ఉన్న ఏపీ బీజేపీ నేతలు కాస్త ఆశ్చర్యంతోనే ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని మోడీ నివాసంలో ఆయన్ను కలుసుకున్న సందర్భంగా ఏపీ కమలనాథుల్ని ఆయన పలుకరించారు. ‘‘ఆంధ్రావారు బాగున్నారా?’’ అంటూ నవ్వుతూ పలుకరించారు. ఈ మాత్రం చాలు.. ఏపీ కమలనాథులు మురిసిపోవటానికి. తమ అందరి పేర్లను మోడీ గుర్తించే అవకాశం లేని విషయం తెలిసిందే. దాన్నికవర్ చేసేందుకు ఆంధ్రా వారూ బాగున్నారా? అన్న మాటతో మురిసిపోయేలా చేసిన మోడీ.. ఆ వెంటనే అడిగిన ఒక ప్రశ్నకు సీమాంధ్ర కమలనాథుల నోట మాట రాని పరిస్థితి.

ఇంతలా మోడీ నుంచి వచ్చిన మాటేమిటంటే.. ఆంధ్రా నుంచి వచ్చిన నేతలందరిని చూసిన ప్రధాని.. ‘‘రాష్ట్రం నుంచి మహిళా నేతలు ఎవరూ రాలేదేమిటి? ’’ అని అడిగారు. దీనికి వెంటనే సమాధానం చెప్పలేక ఇబ్బందిపడినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతల్లో కాస్త పేరు ప్రఖ్యాతులున్న మహిళా నేతలు ఎవరైనా ఉన్నారంటే అది దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రమే. ఆమె మినహా.. ఆ స్థాయిలో అందరికి తెలిసిన మహిళా నేత ఎవరూ లేదన్నది నిజం. ఆ వాస్తవాన్ని మోడీకి చెప్పే ధైర్యం ఉందా? అన్నది ప్రశ్నే.

ఇదిలా ఉంటే.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటూ అడిగిన మోడీకి ఏపీ కమలనాథులు ఏం చెప్పారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదేమో. పవన్ సభ అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన కబురును బీజేపీ వర్గాలు బయటకు ప్రకటించినప్పుడు చెప్పిన మాట కాస్త ఆసక్తికరంగా ఉండటం గమనార్హం. ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే ప్రధాని మోడీని ఏపీ బీజేపీ నేతలు కలుస్తున్నట్లుగా కలర్ ఇచ్చారు. ఓపక్క ప్యాకేజీ అంశంతో పాటు.. హోదా ఇవ్వనందుకు నిరసనగా ఏపీలో బంద్ సాగుతున్న వేళ.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం ప్యాకేజీపై తమ సంతోషాన్ని వ్యక్తం చేయటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.