Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కు మోడీ వెల్ క‌మ్.. కేసీఆర్ కు మాత్రం నో!

By:  Tupaki Desk   |   23 July 2022 6:57 AM GMT
జ‌గ‌న్ కు మోడీ వెల్ క‌మ్.. కేసీఆర్ కు మాత్రం నో!
X
రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ జూలై 24న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. 25న కొత్త రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. ఈ నేప‌థ్యంలో రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు సంద‌ర్భంగా ఢిల్లీలో జూలై 22న నిర్వ‌హించిన విందు కార్య‌క్ర‌మానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ ఆహ్వానించ‌గా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను మాత్రం ఆహ్వానించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపైన నెటిజ‌న్ల‌లో, రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మున్న‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్ త‌న పార్టీ ఎంపీల‌తో మ‌ద్ద‌తు ఇప్పించార‌ని.. ఈ నేప‌థ్యంలో మోడీ ఆహ్వానం జ‌గ‌న్ కు అందింద‌ని అంటున్నారు. ఇక కేసీఆర్ మొద‌టి నుంచి న‌రేంద్ర మోడీతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గుర్తు చేస్తున్నారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు కూడా కేసీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని.. కేసీఆర్ ను రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌లేద‌ని అంటున్నారు.

అలాగే రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్య‌క్ర‌మానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, బీజేపీ మిత్ర‌ప‌క్షాల ముఖ్య‌మంత్రులు, ఉప ముఖ్య‌మంత్రులు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మిలోని పార్టీల‌కు మాత్ర‌మే ఆహ్వానం అందింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే కోవ‌లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఆహ్వానం అందింది. అయితే ఆయ‌న అనారోగ్య కార‌ణాల‌తో రాలేక‌పోతున్నాన‌ని తెలిపారు.

ఆహ్వానం అందినా ఏపీ సీఎం జ‌గ‌న్ హాజ‌రు కాలేదు. ముఖ్యమంత్రి జగన్ ఈ విందు సమయంలోనే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేట‌ర్ల‌తో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న ఎన్నికల పైన దిశానిర్దేశం చేశారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఢిల్లీకి రాలేద‌ని అంటున్నారు.

అలాగే ఏపీలో ఆర్దిక పరిస్థితులు.. పోలవరం. .బియ్యం సేకరణ పైన కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యల పైన వైఎస్సార్సీపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. దీంతో పాటు అచ్చంగా బీజేపీ నేతలే హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ని అంటున్నారు. కాగా సీఎం జగన్ ఈ నెల 25న నూతన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ప్రమాణ స్వీకారానికి వెళ్తారని చెబుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న‌ కేరళ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, మిజోరం, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులను కూడా రామ్ నాథ్ కోవింద్ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించలేదు. అయితే ఒక్క తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మాత్రం ఆహ్వానించడం విశేషం. అయితే ఆయ‌న కూడా హాజ‌రుకాలేదు. అలాగే ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కు ఆహ్వాన‌మందినా ఆయ‌న కూడా రాలేద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కాగా రామ్ నాథ్ కోవింద్ కు ఇచ్చిన‌ విందులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల‌ సీఎంలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ చౌధరి పాల్గొన్నారు.