Begin typing your search above and press return to search.

భాయ్ అండతోనే చిన్నమ్మ పట్టాభిషేకం?

By:  Tupaki Desk   |   6 Feb 2017 9:39 AM GMT
భాయ్ అండతోనే చిన్నమ్మ పట్టాభిషేకం?
X
నిన్న తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి. అన్నా డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలంతా సాహు అంటూ సలామ్ కొట్టి శశికళను సీఎం పదవికి ఎన్నుకోవడం.. గత పదిహేడేళ్లలో నాలుగు సార్లు సీఎం పీఠమెక్కిన అనుభవం ఉన్నా కూడా అమ్మ మాదిరిగానే చిన్నమ్మ పట్లా విశ్వాసం కనబరుస్తూ(?) సన్నీర్ సెల్వం తన సీఎం పదవిని సింపుల్ గా వదిలేయడం వంటివన్నీ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. అసలు అక్కడ జరిగిన రాజకీయమేంటన్నది అర్థం కాక ప్రజలు అయోమయంగా చూస్తున్నారు. అయితే.. మెల్లమెల్లగా అసలు గుట్టు వీడుతోంది. శశికళ పట్టాభిషేకం వెనుక బీజేపీ ఉందని.. అంతా బీజేపీ ప్లాను ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. నరేంద్ర భాయ్( ప్రధాని ) సూచనలతో అమిత్ షా డైరెక్టన్లో అసోసియేట్ డైరెక్టర్ సీహెచ్ విద్యాసాగరరావు అంతా చూసుకున్నారని టాక్. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలన్న ప్లానుతో శశికళపై అభిమానం లేకున్నా ఆమె బలం తమకు అవసరమన్న కోణంలో బీజేపీ ఈ అడుగు వేసినట్లు చెబుతున్నారు.

నిజానికి తమిళనాట గత నాలుగు దశాబ్ధాల క్రితమే జాతీయ పార్టీలకు నూకలు చెల్లాయి. అప్పట్నుంచి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఏ విధంగానూ ఫలించలేదు. చివరకు ద్రావిడ పార్టీల్తో పొత్తు పెట్టుకుని తోక పార్టీల్లాగే కొనసాగాల్సిన దుస్థితి వీటికేర్పడింది. ఈ దశలో అధికార బిజెపి అందుబాటులోకొచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా తన ఆధిపత్య చెలాయింపునకు మార్గాన్ని సుగమం చేసుకుంది. జయలలిత ఆసుపత్రిలో చేరినప్పట్నుంచి పరిణామాల్ని నిశితంగా గమనించిన కేంద్రం ఇప్పట్లో బిజెపికెలాగూ సొంతంగా ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశంలేనందున కనీసం ఈ అవకాశం నుంచే తన రాజకీయ ప్రయోజనాన్ని సిద్దింపజేసుకోవాలని పక్కా వ్యూహంతో ముందుకెళ్ళింది.

రోశయ్య పదవీ విరమణ అనంతరం వ్యూహరచనలో దిట్టయిన విద్యాసాగరరావును తమిళనాడుకు ఇన్‌చార్జి గవవర్నర్‌గా నియమించడంతో అసలు కథ మొదలైంది. జయ మరణానంతరం ఏ ఒక్క నిమిషాన్ని కేంద్రం వృధా చేసుకోలేదు. ప్రతి అంశాన్ని తనకనుకూలంగా తిప్పుకుంది. జయకు మాత్రమే విశ్వాసపాత్రుడైన పన్నీర్‌ ను బిజెపి నమ్మలేకపోయింది. ఆయన నాయకత్వ సామర్ద్యంపై కూడా ఆ పార్టీకి విశ్వాసం కలగలేదు. జయను ఆసుపత్రిలో పెట్టినప్పట్నుంచి శశికళతో బిజెపి నేతలు నేరుగా ట చ్‌లోకొచ్చారు. ఆమెతో సంప్రదింపులు జరుపుతూ ఆమెను గుప్పెట పట్టారు. జయ మృతి వెంటనే శశికళకు పట్టంగడితే దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలెళ్తాయన్న ఆలోచనతోనే జయ విశ్వసనీయుడు పన్నీర్‌ను మరోసారి తెరపైకితెచ్చారు. పార్టీలో పెల్లుబికుతున్న అసమ్మతిని అణిచిపట్టి రెండుమాసాలు తిరక్కముందే తమ తరపున శశికళకు పట్టంగట్టేందుకు రంగం సిద్దం చేశారు. గత నాలుగురోజులుగా తమిళనాడులో పరిణామాలు వేగం పుంజుకున్నాయి. వీటిని నిశితంగా పరిశీలించిన విపక్ష డిఎమ్‌కె కూడా ఎలాంటి ముందడు గేయలేక పోయింది. పార్టీలో చీలికొస్తుందని ఆశించినప్పటికీ అది సాకారం కాలేదు.

మరోవైపు కేంద్రం డైరెక్టుగా డీల్ చేస్తుందని అర్థం చేసుకోవడంతో శశికళ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఏకవాఖ్య తీర్మానానికి తలలూపేశారు. శశినే తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఇదికూడా పక్కా వ్యూహం ప్రకారమే జరిగింది. మరే అంశంపైన చర్చకు తావులేకుండా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొత్తనేత ఎంపిక జరిగిపోయింది. వ్యూహరచనలో దిట్టయిన బిజెపి నేతల పకడ్బందీ ప్రణాళికల కు విపక్ష డిఎమ్‌కె కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవాల్సొ చ్చింది. వాస్తవానికి మరో నాలుగుమాసాల పాటు పన్నీర్‌తోనే పబ్బం గడపాలని బిజెపి ఆలోచించింది. అయితే ఆ పార్టీకి జల్లికట్టు వివాదం అనూహ్యంగా కలిసొచ్చింది. జల్లికట్టుపై తమిళ ప్రజలంతా ఏకతాటిపైకొచ్చారు. అలాంటి సమయంలో నిషేదాన్ని తొలగిస్తూ ఆఘమేఘాలమీద కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేయడంతో బిజెపి పట్ల తమిళుల్లో సానుకూలతేర్పడింది.

మరోవైపు శశికళను తమకు విధేయురాలిగానే కేంద్రం భావించింది. పన్నీర్‌కంటే కూడా శశికళ పాలనా వ్యవహారాల్ని చక్కదిద్దగలరన్న నమ్మకానికి వచ్చింది. అలాగే శశికళ ఎప్పటికి తమకెదురుతిరిగే అవకాశాల్లేకుండా ముందస్తుగానే పలు అంశాలకు సంబం ధించి కీలక సమాచారాన్ని కేంద్రం తన గుప్పెటపట్టినట్లు టాక్. జయలలిత మరణ రహస్యం అందులో ఒకటి. దీన్నుంచి శశికళ ఎప్పటికీ బయటపడే అవకాశాలుండవు. అంతవరకు శశికళ బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితులు రావన్నది బిజెపి వ్యూహకర్తల ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి శశికళ కోరిక, బీజేపీ అవసరాలు రెండూ తీరేలా తమిళనాడులో కొత్త పాలన మొదలవబోతోందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/