Begin typing your search above and press return to search.

మోడీ చేతులు ఎత్తేసిన పనిని.. సక్సెస్ ఫుల్ గా చేస్తున్న సీఎం

By:  Tupaki Desk   |   7 July 2021 4:30 AM GMT
మోడీ చేతులు ఎత్తేసిన పనిని.. సక్సెస్ ఫుల్ గా చేస్తున్న సీఎం
X
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ప్రధాని మోడీ మహా పట్టుదలగా ఉంటారు. పాలకుడికి ఉండాల్సిన కనీస విషయాలు కొన్ని ఆయనలో అస్సలు కనిపించవు. నిధుల కేటాయింపులో ఆయన ఉదారం అన్నది కనిపించదు. ఎవరినైనా వారి జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టమంటే ఎంతలా విలవిలలాడిపోతారో.. ప్రధాని మోడీ సైతంఅదే తీరును ప్రదర్శిస్తారు. కాకుంటే.. ఆయన జేబులో నుంచి డబ్బులు తీయటానికి కాదు.. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు తీసి రాష్ట్రాలకు ఇవ్వటానికి సైతం కిందామీదా పడతారు. అదే పనిగా అడిగినా.. అవసరానికి సరిపడా నిధులు ఇచ్చేందుకు ఆయన ఎంతలా ఇబ్బంది పడతారో గడిచిన ఏడేళ్ల మోడీ పాలనను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

విపత్తులు చోటు చేసుకున్నంతనే రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఫోన్లు చేయటం.. కేంద్రం అండగా ఉంటుందని చెప్పటం తెలిసిందే. మాటల్లో కనిపించే తియ్యదనం.. చేతల వరకు వచ్చేసరికి కనిపించదు. విశాఖతో పాటు.. విజయనగరం జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేసిన హుదూద్ తుఫాను విషయంలో ఏపీకి మోడీ సర్కారు అందించిన సాయం ఎంతన్నది చూస్తే.. మోడీ తీరు ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అదే సమయంలో.. ఏ మాత్రం అవకాశం వచ్చేసినా పన్నుల మోత మోగించే ఆయన ప్రభుత్వం పుణ్యమా అని పెట్రోల్.. డీజిల్ ధరలు లీటరు వంద దాటేయటం.. డీజిల్ ధర వందకు చాలా దగ్గరగా వచ్చేయటం తెలిసిందే.

ఈ విషయాల్ని ఇలా ఉంచితే.. దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నేపథ్యంలో.. మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ వేళ ఎంతోమంది మరణించారు. అధికారిక లెక్కలకు దాదాపు పది రెట్లు ఎక్కువగా కరోనా మరణాలు ఉన్నట్లుగా ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంత దాకా ఎందుకు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి పరిచయం ఉన్నవారిలో కనీసం ఇద్దరు ముగ్గురైనా కరోనా కారణంగా మరణించిన ఉదంతాన్ని వింటున్న పరిస్థితి. ఇలాంటి దారుణ పరిస్థితి ఇప్పటివరకు ఎప్పుడూ ఎదుర్కొన్నది లేదు. ఇలాంటివేళ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం లేదు.

అప్పటివరకు బాగానే ఉండి.. అంతలోనే కరోనా బారిన పడటం.. వైద్యానికి భారీగా ఖర్చు పెట్టటం..అంతలోనే కాలం చేసిన వేళ.. ఇంటి పెద్ద మరణిస్తే.. బాధిత కుటుంబానికి ఎంత కష్టమన్నది మాటల్లో చెప్పలేనిది. ఇలాంటివేళ.. ప్రభుత్వానికి ఇబ్బంది అయినప్పటికీ ఉదారంగా వ్యవహరిస్తూ వారిని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా కారణంగా మరణించిన వారికి సాయం చేయాలని.. ప్రభుత్వం అండగా నిలవాలని కోర్టులు చెప్పినప్పటికీ.. అందుకు మోడీ సర్కారు సుముఖంగా లేకపోవటం తెలిసిందే. అంతేనా.. కరోనా బాధితులకు సాయం కింద ఇచ్చే మొత్తం సాధ్యం కాదని తేల్చేయటం మోడీ సర్కారుకే చెల్లుతుంది. ఇలా కరోనా మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది.

ఇలాంటివేళలో.. ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవటానికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.50వేలుచొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కొవిడ్ -19 పరివార్ ఆర్థిక్ సహాయ్ తా యోజన’నను గత నెల 22న ప్రకటించటం ద్వారా.. మోడీ కంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెటర్ అన్నట్లుగా వ్యవహరించారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది.

కరోనా మృతులకు అందించే ప్రభుత్వ సాయం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎవరైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే.. అందులో లోపాల్ని వెతికే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50వేల సాయంతో పాటు.. సదరు బాధితుడి ఇంటికి అతడే ఏకైక ఆర్థిక వనరుగా ఉన్న వారికి అదనంగా నెలకు రూ.2500 చొప్పున ఇస్తారు. బాధిత కుటుంబాల వద్ద సరైన ధ్రువపత్రాలు లేకుండా వారిని నిరాశకు గురి చేయొద్దని.. ఆ పత్రాలు సమకూరేలా సాయం చేయాలని కోరారు. పాలకుడు అంటే ఇలా ఉండాలి కదా? మోడీలో మిస్ అయ్యేది ఇదే అంశమన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది.