Begin typing your search above and press return to search.

మోడీ అమ్మ మీద కాంగ్రెస్ ఎంక్వయిరీ చేసిందట

By:  Tupaki Desk   |   29 Sep 2015 4:39 AM GMT
మోడీ అమ్మ మీద కాంగ్రెస్ ఎంక్వయిరీ చేసిందట
X
తమను తప్పించి దేశాన్ని మరెవరూ బాగు చేయలేరని.. దేశానికి ఏం చేసినా గాంధీ కుటుంబం మాత్రమే చేయాలనే సిత్రమైన మైండ్ సెట్ కాంగ్రెస్ నేతల సొంతం. ఒక సాదాసీదా వ్యక్తి ప్రధాని కావటం.. అందులోనూ చిన్నతనంలో టీలు అమ్ముకున్న వ్యక్తి దేశ అత్యున్నత స్థానానికి చేరుకోవటమే కాదు.. విదేశీ వ్యవహారాలు దగ్గర నుంచి.. దేశీయంగా పలు అంశాల విషయంలో తనదైన మార్క్ వేయటంపై కాంగ్రెస్ కంటగింపుగా మారింది.

తాజాగా తన అమెరికా పర్యటన సందర్భంగా ఫేస్ బుక్ అధిపతి జుకర్ బర్గ్ తో నిర్వహించిన సమావేశంలో తన తల్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. చిన్నప్పుడు తమను పెంచేందుకు ఆమె పాచి పని చేసిందని.. ఇళ్లల్లో పని చేసి తమను పెద్ద చేసేందుకు ఎంతో కష్టపడిందని మోడీ చెప్పుకోవటం తెలిసిందే.

దీనిపై కాంగ్రెస్ తనదైన విమర్శల దాడి మొదలు పెట్టింది. మోడీ తన తల్లి గురించి చెప్పిన విషయాల మీద ఎంక్వయిరీ చేశామని.. మోడీ అన్ని అబద్ధాలు చెప్పినట్లుగా తేలిందని మండిపడుతోంది. తన తల్లి పాచి పని చేసిందని.. పలువురి ఇళ్లల్లో గిన్నెలు తోమిందన్న మాటల్లో నిజం ఎంతో తెలుసుకోవటం కోసం ఎంక్వయిరీ చేస్తే.. అవన్నీ అవాస్తవాలుగా తేలిందని.. మోడీ తల్లి ఏనాడు పాచి పని చేయలేదని చెప్పుకొచ్చారు.

తన తల్లిని అవమాన పర్చేలా మోడీ మాట్లాడారంటూ అనంద్ శర్మ లాంటి నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు. అయినా.. మోడీ తల్లి మీద ఎంక్వయిరీ చేసే బదులు.. మోడీ విదేశాలకు వెళ్లిన సమయంలోనే వెళ్లిన తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఎక్కడికి వెళ్లారో ఎంక్వయిరీ ఎందుకు చేయరు? పార్టీ అధినేత్రి సోనియా.. ఆమె కుమారుడు రాహుల్ విద్యాభాస్యం గురించి వివాదం ఉన్న విషయం తెలిసిందే. మరి.. దీనిపై కాంగ్రెస్ ఏనాడైనా ఎంక్వయిరీ చేసిందా? ఆ మధ్యన రాహుల్ కొన్ని రోజుల పాటు రహస్య పర్యటన చేయటం తెలిసిందే. మరి.. దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎంక్వయిరీ నిర్వహించిందా? అన్న విషయాల్ని ఆనంద్ శర్మ లాంటి నేతలు చెబితే బాగుంటుంది. ఎవరికైనా కాస్త మంచిపేరు వస్తుందంటే ఓర్చుకోలేని కాంగ్రెస్ నేతలు.. తమ కింద ఉన్న నలుపు గురించి ఆలోచిస్తే.. వారికే కాదు దేశానికి మంచిదేమో.