Begin typing your search above and press return to search.

నిప్పులాంటి మోడీ.. నిక్కచ్చి ఐఏఎస్ అధికారిని ఎందుకు పట్టించుకోరు?

By:  Tupaki Desk   |   10 Jan 2023 4:12 AM GMT
నిప్పులాంటి మోడీ.. నిక్కచ్చి ఐఏఎస్ అధికారిని ఎందుకు పట్టించుకోరు?
X
నరేంద్ర మోడీ అన్నంతనే.. చాలామంది ఒళ్లు పులకరిస్తుంది. ఆ మహానుభావుడి కారణంగానే భారత కీర్తి ప్రతిష్టలు ఎంతలా పెరిగిపోయాయో తెలుసా? అన్న మాట దగ్గర నుంచి గడిచిన ఎనిమిదిన్నరేళ్ల పుణ్యకాలం గురించి గంటల కొద్దీ స్పీచులు ఇచ్చేందుకు వెనుకాడరు. నిప్పునకు పర్యాయపదంగా పోల్చే మోడీ సాహెబ్ వారి రాజ్యంలో.. అసేతు హిమాచలంలోని ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే విషయాన్ని సైతం తన మానసపుత్రిక అయిన 'మన్ కీ బాత్' లో అదే పనిగా ప్రస్తావించే ఆయన గురించి కథలు కథలుగా చెప్పేందుకు వెనుకాడరు.

మరి.. అలాంటి మోడీ నికచ్చి.. నికార్సు అయిన అధికారుల గురించి.. వారికి జరిగే అవమానాల గురించి ఎందుకు పట్టదు? అన్నది ప్రశ్న. దేశంలో ఏ మూలన ఏం జరిగినా.. క్షణాల్లో ఆయనకు సమాచారం అందుతుందన్న విషయం దగ్గర నుంచి కొన్నిసార్లుఅర్థరాత్రి వేళలోనూ వాయు వేగంతో ఆయన తీసుకునే నిర్ణయాల గురించి స్టోరీలు కొన్ని మీడియాలో అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. ఇన్ని చేసే ఆయన.. దేశం కోసం.. దేశ ప్రయోజనాల గురించి అనుక్షణం ఆలోచిస్తూ.. సొంత కుటుంబాన్ని.. వారి ప్రయోజనాలను కాదనుకొని నీతిగా.. నిజాయితీగా పని చేసే అధికారుల విషయంలో మోడీ ఎందుకు జోక్యం చేసుకోరు?

వారిపై బదిలీ వేటు వేసిన వేళ.. అలాంటి వారిని తీసుకొచ్చి పీఎంవోలో ఎందుకు పెట్టరు? పెద్ద పదవులు.. బాధ్యతలు ఎందుకు అప్పగించరు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం చెప్పే వారు కనిపించరు. నీతికి.. న్యాయానికి నిలువుటద్దంగా.. రూల్ బుక్ ను ఏ మాత్రం మిస్ కాకుండా ఫాలో అయ్యే అధికారుల పేర్లు చెప్పమన్నంతనే గుర్తుకు వచ్చే పేర్లు కొన్ని ఉంటాయి. ఆ పేర్లలో పలువురు గుర్తించే పేర్లు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి అశోక్ ఖేమ్కా. ఆయన పేరు చెప్పినంతనే సోనియా గాంధీ హవా నడుస్తున్న వేళలో.. ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమ భూ ఒప్పందానికి సంబంధించిన మ్యుటేషన్ ను రద్దు చేసిన సంచలనంగా మారిన వైనం గుర్తుకు రాక మానదు.

దేశాన్ని తన రిమోట్ కంట్రోల్ తో కట్టడి చేసే వారి వ్యక్తిగత వ్యాపారాల విషయాల్లోనూ రాజీ పడని ఆయన తీరు అప్పట్లో పెను సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్ కు చెందిన ఆయన విద్యాభాస్యం ఖరగ్ పూర్ ఐఐటీలో సాగింది. మేధావిగా.. నిక్కచ్చి అధికారిగా ఆయనకు పేరుంది. 1991 బ్యాచ్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి కెరీర్ కోసం రాజీ పడేందుకు అస్సలు ఇష్టపడరు. దేనికైనా.. ఎంత పెద్ద వారితో అయినా తలపడేందుకు అస్సలు వెనుకాడరు. ఇదే ఆయనకు మైనస్ గా మారిందంటారు. ముక్కుసూటితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా సూట్ అయ్యే ఆయన 30 ఏళ్ల కెరీర్ లో తాజాగా 56వ బదిలీ వేటు పడింది.

హర్యానా క్యాడర్ లో పని చేసే ఆయన్ను తాజాగా రాష్ట్ర ఆర్కైవ్స్ కు బదిలీ చేశారు. హర్యానా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ను ఈసారి బదిలీ ఎందుకు చేశారన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు ఆయన రాసిన లేఖే కారణమంటున్నారు.

తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పని ఉండాలని కోరటమే ఆయనపై తాజా వేటు పడటానికి కారణమైనట్లుగా చెబుతున్నారు. తన కెరీర్ లో అప్రాధాన్య పోస్టుల్లోనే దీర్ఘకాలం సాగిన ఆయన.. ఆర్కైవ్ శాఖలో పని చేయటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. మరి.. ఇలాంటి ముక్కుసూటి అధికారులను నిప్పు లాంటి మోడీ ఎందుకు కీలక పదవుల్లో నియమించరు? ఆయన తలుచుకుంటే అదేమైనా పెద్ద విషయమంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.