Begin typing your search above and press return to search.

మోడీ క్రిష్ణుడు : బాబు... జగన్ లలో ధుర్యోధనుడెవరు...?

By:  Tupaki Desk   |   31 Aug 2022 7:49 AM GMT
మోడీ క్రిష్ణుడు : బాబు... జగన్ లలో ధుర్యోధనుడెవరు...?
X
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు కరెక్ట్ గా ఇరవై నెలల పై దాటి వ్యవధి ఉంది. ఇంకా 2023 ఏడాది పూర్తిగా సాగాలి. ఇక ఈ ఏడాదిలో నాలుగు నెలలు మిగిలే ఉన్నాయి. అయినా సరే రాజకీయం వండి వార్చే వారికి ఆ వేడి అలా సలసలమని మండుతూనే ఉండాలి. ఏపీలో అర్జంటుగా ఎన్నికలు పెడితే అధికారంలోకి వచ్చేయాలన్న ఆత్రం టీడీపీది.

అందుకే ఆ పార్టీలో నుంచే పొత్తుల చర్చ సాగుతూ వస్తోంది. ఇక ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళి మూడేళ్ళ సుదీర్ఘమైన గ్యాప్ తరువాత మోడీతో షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చిన చంద్రబాబుకు పొత్తులు కుదురుతాయని ఆశలు ఏవో పెరిగాయి అంటున్నారు. ఇక దానికి తోడు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు మరో వైపు ఈ పొత్తులు ఖాయమని అంటున్నారు. జాతీయ మీడియా సైతం ఇదే నిజమని చెబుతూ వీకెండ్ కాలమ్స్ రాసోంది. దాంతో ఇక పొత్తు కన్ఫర్మ్ అని అంటున్నారు.

అయితే ఏపీ బీజేపీకి ఇంచార్జి గా ఉన్న సునీల్ డియోధర్ అయితే ఇవన్నీ టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని కొట్టిపారేశారు. ఎవరో సంపాదికీయాలు రాస్తే తాము పొత్తులు పెట్టుకుంటామా అని లాజిక్ పాయింట్ ని లేవదీశారు. ప్రధాని మోడీ ఎందరినో కలుస్తూంటారని, దానికి చిలవలు పలవలూ పేర్చి రాసుకోవడం అంటే అది వారి తప్పే తప్ప మరోటి కాదని కూడా క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని కేవలం చంద్రబాబునే కలవలేదని, అక్కడికి వచ్చిన ఫరూఖ్ అబ్దుల్లా సహా చాలా మంది కీలక నేతలను కలిశారని గుర్తు చేశారు. అంతమాత్రాన వారందరితో పొత్తులు ఉంటాయా అన్నట్లుగా ఆయన లా పాయింట్ బాగానే తీశారు. ఇక శ్రీకృష్ణుడు అంతటి వారు దుర్యోధనుదు తన వద్దకు వస్తే కలిసి మాట్లాడారని అంత మాత్రం చేత ఆయంతో చేతులు కలపలేదని, ఏ రకమైన సాయం చేయలేదని మహాభారత పర్వాన్ని కూడా సునీల్ గుర్తు చేశారు. ఇక ఏపీ సీఎం హోదాలోనే జగన్ మోడీని పలుమార్లు కలుస్తున్నారు తప్ప అందులో రాజకీయం ఏదీ లేదని కూడా ఆయన అంటున్నారు.

అందువల్ల టీడీపీ సహా ఏ పార్టీతో అయినా పొత్తులు అన్నవి కుదిరేవి కానే కావని తేల్చేశారు. ఒక వేళ పొత్తులు తేల్చాలి అంటే అది బీజేపీ పార్లమెంటరీ బోర్డులోనే డిసైడ్ అవుతుంది అని కూడా చెప్పుకొచ్చారు. సరే సునీల్ డియోధర్ చెప్పినది బాగున్నది అనుకున్నా ఆయన చెబుతున్న శ్రీకృష్ణుడు వారి ప్రధాని మోడీ అనుకున్నా దుర్యధనుడు ఎవరో సెలవీయలేదని అంటున్నారు. ఏపీ నుంచి అటు జగన్ ఇటు చంద్రబాబు వరసగా మోడీని కలిశారు.

మోడీకి ఎవరు దుర్యోధనుడిలా కనిపిస్తున్నారో సునీల్ చెబితే బాగుండేది పూర్తి క్లారిటీ వచ్చేది అనే వారు కూడా ఉన్నారు. మరి ఎన్నిక ముందు పొత్తులు ఉంటాయని కాస్తా ఊరించారు కాబట్టి అప్పటికి టీడీపీతో పొత్తు కుదిరిగే శ్రీకృష్ణుడిగా మోడీ బాబు పక్షం వహించే అవకాశాలు ఉంటాయేమో. లేక పొత్తులు వద్దు అనుకుని ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో వైసీపీ టీడీపీ రెండూ వైరి పక్షంగానే ఉంటాయని అనుకోవాలేమో. ఏది ఏమైనా సునీల్ తమ నేతను కృష్ణుడితో పోల్చుకోవడంలో తప్పులేదు కానీ ఏపీలో కీలక నేతలను దుర్యోధనుడితో పోల్చడం తగునా అన్నదే ఇపుడు అంతటా సాగుతున్న చర్చట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.