Begin typing your search above and press return to search.

సంచలన ప్రకటన చేసిన మోడీ.. 3 వ్యవసాయ చట్టాల రద్దు

By:  Tupaki Desk   |   19 Nov 2021 4:57 AM GMT
సంచలన ప్రకటన చేసిన మోడీ.. 3 వ్యవసాయ చట్టాల రద్దు
X
ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాము అనుకున్నది మాత్రమే చేస్తామన్న మొండితనం మోడీ సర్కారుకు ఎక్కువన్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ఎంతలా గొంతు చించుకున్నా సరే విననట్లుగా వ్యవహరించటం ప్రధాని మోడీకి ఉన్న అలవాటుగా చెబుతారు. అలాంటి మోడీ తన ఏడున్నరేళ్లపాలనలో ఎప్పుడూ లేని రీతిలో సంచలన నిర్ణయాన్ని తాజాగా ప్రకటించారు.

ఈ రోజు (శుక్రవారం) ఉదయం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయనున్నట్లుగా ప్రకటించారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేందుకు అవసరమైన రాజ్యాంగబద్ధమైన చర్యల్ని తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో.. ఏడాదిన్నరకు పైనే సాగుతున్న రైతు ఉద్యమాలకు కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా చెప్పాలి.

ఇంతకాలం రైతులు చేస్తున్న ఉద్యమాలపై ఘాటు విమర్శలు చేస్తూ.. పిడివాదాన్ని వినిపిస్తున్న మోడీ అండ్ కో ఇప్పుడేం సమాధానం చెబుతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ‘మేం మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయటానికి నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో.. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు మంగళం పాడినట్లైంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మంగళం పాడే వరకు తాము కేంద్రంతో యుద్ధం చేస్తామని గురువారం నిర్వహించిన మహాధర్నా వేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయటం తెలిసిందే.

ఏమైనా.. వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్రం చేతులు కాలాక ఆకులు పట్టకున్న చందంగా వ్యవహరించిందని చెప్పాలి. నిజానికి.. ఉద్యమం మొదట్లోనే.. రైతు నాయకులు వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేసినా.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎవరి మాట వినని మొండిఘటంగా వ్యవహరించే మోడీ మాష్టారు.. తాజాగా తీసుకున్ననిర్ణయం చూస్తే.. మోడీ సైతం వెనకడుగు వేస్తారన్న విషయం స్పష్టమైనట్లే.