Begin typing your search above and press return to search.

మోడీనా మజాకా?: టార్గెట్ 150 జోరెత్తిన నినాదం

By:  Tupaki Desk   |   23 Nov 2022 4:34 AM GMT
మోడీనా మజాకా?: టార్గెట్ 150 జోరెత్తిన నినాదం
X
న‌రేంద్ర మోడీ. కేవ‌లం ప్ర‌ధాని మాత్ర‌మే కాదు. రాజ‌కీయ పండితుడు. మాట‌ల మాంత్రికుడు. తాను చేయాల‌నుకున్న‌ది చేసే నాయ‌కుడుగా గుజ‌రాత్‌పై త‌న ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ప‌నిచేస్తున్నారు. దేశానికి ప్ర‌ధాని అయినా, గుజ‌రాత్‌కు మాత్రం ఆయ‌న ఇప్పుడు ఏకైక నాయ‌కుడు. బీజేపీని, ఆ పార్టీ నాయ‌కుల‌ను న‌డిపించే ఏకైక వ్య‌క్తి, మ‌రోసారి క‌మ‌లం పార్టీని అధికారంలోకి తీసుకురాగ‌ల ఏకైక శ‌క్తి కూడా ఆయ‌నే అనే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో మోడీ తాజాగా ఇచ్చిన నినాదం.. 'టార్గెట్ 150'. దీనిని బీజేపీ నాయ‌కులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

గుజరాత్ ఎన్నికల్లో ప్ర‌ధాని మోడీ అన్నీ తానై బీజేపీని నడిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వెంటాడుతున్నా... 'నన్ను చూసి ఓటేయండి' అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. గెలుపుపై ధీమా ఉన్నా.. సాధారణ విజయం సరిపోదని మోడీ భావిస్తున్నారు. రికార్డులు బద్దలు కొట్టేలా.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల‌ను త‌రిమి కొట్టేలా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిస్తున్నారు.

గుజరాత్లో ప్ర‌దాని మోడీ ప్రచార సరళిని ప‌రిశీలిస్తుంటే.. ఏడోసారి ఎలాగైనా గెలవాలని ఆయ‌న కంకణం కట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాష్ట్రంలో ఎప్పటిలాగే గెలిస్తే సరిపోదని.. రికార్డు మెజార్టీతో విజయం సాధించాలని మోడీ భావిస్తున్నారు. గతంలో నమోదైన రికార్డులను తిరగరాయాలని ఆయన సంకల్పించుకున్నారు. 1985లో మాధవ్సిన్స్ సోలంకి కాంగ్రెస్ను గెలిపించిన మాదిరిగానే.. బీజేపీ రికార్డు విజయం సాధించాలని మోడీ అనుకుంటున్నారు.

అప్పుడు ఏం జ‌రిగింది?గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. 1985లో జరిగిన ఎన్నికల్లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకుంది. మోడీ హవా ఓ రేంజ్లో ఉన్న కాలంలో కూడా బీజేపీ ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రికార్డుపై మోడీ కన్నేసినట్లు తెలుస్తోంది. 150 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు.

అయితే, బీజేపీ రాజ‌కీయ‌ చాణక్యుడు అమిత్ షా లెక్క మాత్రం మరోలా ఉంది. కాస్త వాస్తవిక కోణంలో ఆలోచించే షా.. గుజరాత్లో 130 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని భావిస్తున్నట్లు గుస‌గుస వినిపిస్తోంది.

లెక్కలపై మక్కువెందుకో?భారీ విజయం సాధించడం ద్వారా.. గుజరాత్పై తాము ఏమాత్రం పట్టు కోల్పోలేదని మోడీ.. తన విరోధులకు చాటిచెప్పవచ్చు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొత్తవారు బరిలో దిగినా.. తమ అధికారానికి ఢోకా లేదని నిరూపించుకోవచ్చు. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఉచితాలపై వాగ్దానాలు చేయలేదు. అయినప్పటికీ, ప్రజలు తమ వెంటే ఉన్నారని నిరూపించుకోవడం ద్వారా త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌భ వెలిగేందుకు కూడా బాట‌లు ప‌రుచుకునే ఛాన్స్ ఉంద‌ని భావిస్తున్నారు. మొత్తానికి మోడీ టార్గెట్ 150 జోరుగానే ముందుకు సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.