Begin typing your search above and press return to search.

మోదీ... ఈ హైటెన్ష‌న్ దేనికీ?

By:  Tupaki Desk   |   2 Sep 2017 10:36 AM GMT
మోదీ... ఈ హైటెన్ష‌న్ దేనికీ?
X
కేంద్ర కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌కు సంబంధించి గ‌డ‌చిన రెండు రోజులుగా పెద్ద ఎత్తున క‌థ‌నాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజు వ‌చ్చిన క‌థ‌నాలు రేప‌టిలోగా మారిపోతున్నాయి. కేంద్ర జ‌ల‌వ‌నరుల శాఖ మంత్రి ఉమాభార‌తి - కార్మిక శాఖ మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌ - రాజీవ్ ప్ర‌తాప్ రూడీ సహా ఇప్ప‌టికే ఏడుగురు కీల‌క మంత్రులు త‌మ స‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించేశారు. ఏ క్ష‌ణంలోనైనా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేందుకు మ‌రో ఐదుగురు మంత్రులు సిద్ధంగా ఉన్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే... కేబినెట్ పున‌ర్య‌వ‌వ‌స్థీక‌ర‌ణ జ‌ర‌గ‌క‌ముందే.. మొత్తంగా 12 మంది మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన‌ట్ల‌వుతుంది. ఇక కొత్త‌గా ఎన్డీఏ కూట‌మిలో చేరిన జేడీయూ, అన్నాడీఎంకేల‌కు కొత్త‌గా మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలుండ‌టంతో... ఇప్పుడున్న మంత్రుల్లో కొంద‌రి చేత రాజీనామాలు చేయించార‌ని స‌మాచారం.

అయినా కేబినెట్ విస్త‌ర‌ణో... లేదంటే పున‌ర్వవ‌స్థీక‌ర‌ణో తెలియ‌దు గానీ... ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు న‌రేంద్ర మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు జ‌నాల్లో హైటెన్ష‌న్ పెంచుతోంద‌నే చెప్పాలి. మోదీ స‌ర్కారు చేపడుతున్న చర్య‌ల‌ను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం త‌న‌కు అనుకూలంగా చెప్పుకుంటుండ‌టంతో ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌లు త‌మ రాష్ట్రానికి ఈ కేబినెట్ ష‌ఫిలింగ్‌ లో ఏ మేర‌కు న్యాయం జ‌ర‌గ‌నుంది? అన్న కోణంలో ఆరాలు తీస్తున్నారు. మ‌రికొంద‌రైతే... ఈ కేబినెట్ విస్త‌ర‌ణ‌తో త‌మ రాష్ట్రానికి అస‌లు లాభ‌మెంత‌?... నష్ట‌మెంత‌? అన్న కోణంలో లెక్క‌లేస్తున్నారు. ఇక ఆయా రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ పార్టీలు కూడా ఈ ద‌ఫా కేబినెట్ విస్త‌ర‌ణ‌పై అమితాస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌రుగుతున్న కేబినెట్ విస్త‌ర‌ణ‌... త‌మ త‌మ రాష్ట్రాల‌కు సంబంధించి ఏఏ పార్టీల‌కు ప్రాధాన్యం ద‌క్కుతోంది? దాని ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంది? అన్న కోణంలో పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అయినా ఏ ప్ర‌ధాని అయినా త‌న కేబినెట్‌ ను పున‌ర్వ‌వ‌స్థీక‌రించుకోవాల‌ని భావించిన‌ప్పుడు.. పూర్తి స్థాయి క‌స‌ర‌త్తు పూర్తి అయిన త‌ర్వాతే కేబినెట్ విస్త‌ర‌ణ‌కు సంబంధించిన స‌మాచారాన్ని విడుద‌ల చేసేవారు. అంటే... చివ‌రి నిమిషం దాకా కేబినెట్ విస్త‌ర‌ణ‌పై ఊహాగానాలకు తావు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అయితే అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన మోదీ... కేబినెట్ విస్త‌ర‌ణ‌కు నాలుగు రోజులు ముందుగానే రూడీ లాంటి కీల‌క మంత్రుల చేత రాజీనామా చేయించి పెద్ద చ‌ర్చ‌కు... మ‌రింత పెద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణానికి తెర తీశార‌ని చెప్పాలి. ఎవ‌రెన్ని చెప్పినా.. త‌న నిర్ణ‌యాన్ని మార్చుకునేందుకు స‌సేమిరా అనే మోదీ... ఇప్పుడు త‌న‌కు విన‌తులు వెల్లువెత్తేలా కేబినెట్ విస్త‌ర‌ణ‌కు నాలుగు రోజులు ముందుగా దానికి సంబంధించిన సంకేతాలు పంపించ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఏది ఏమైనా... రేపు ఉద‌యం కేబినెట్ విస్త‌ర‌ణ‌కు సంబంధించి ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగే స‌మ‌యం... అంటే లాస్ట్ మినిట్ దాకా ఈ హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం మాత్రం కొన‌సాగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది.