Begin typing your search above and press return to search.

మిడ‌త‌ల న‌ష్టాన్ని మేం భ‌రిస్తాం: మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   31 May 2020 12:12 PM GMT
మిడ‌త‌ల న‌ష్టాన్ని మేం భ‌రిస్తాం: మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌
X
ఎడారి ప్రాంత దేశాల నుంచి మ‌న‌దేశంలోకి ప్ర‌వేశించి పంట‌ల‌ను తీవ్రంగా తినేస్తూ రైతుల‌ను న‌ట్టేటా ముంచుతున్న మిడ‌త‌ల దండు మ‌రిన్ని రాష్ట్రాల్లో ప్ర‌భావం చూపుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దండెత్తుతున్నాయి. అయితే మిడతల దాడితో న‌ష్ట‌పోయిన రాష్ట్రాల‌ను తాము ఆదుకుంటామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. అన్ని విధాలా స‌హాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఆల్ ఇండియా రేడియోలో ప్ర‌తి చివ‌రి ఆదివారం మ‌న్‌ కీ బాత్ కార్య‌క్ర‌మంలో మాట్లాడ‌డంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి మే 31వ తేదీ ఆదివారం కూడా రేడియో ద్వారా ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. మిడ‌త‌ల బెడదను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు అన్ని విధాలా సాయపడతామని హామీ ఇచ్చా రు. ఈ సమస్యతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ - మహారాష్ట్ర - పంజాబ్ - రాజస్థాన్ - గుజరాత్ - మధ్యప్రదేశ్ - హర్యానా రాష్ట్రాల్లో ఈ రెండు వారాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉద్ ఫున్ తుపాను కారణంగా ముప్పు ఏర్పడగా.. ఇప్పుడు అనేక రాష్ట్రాలు మిడతల దండ‌యాత్ర‌తో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒక చిన్న ప్రాణి కూడా ఎంత నష్టం కలగజేస్తుందో ఈ దాడులు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. ఇవి ఎన్నో రోజులపాటు కొనసాగుతాయని, ఈ సమస్య నివారణకు కేంద్రం - రాష్ట్రాలు కూడా ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞాన్ని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని మనమంతా సమష్టిగా ఎదుర్కోగలమన్న విశ్వాసం తనకు ఉందని మోదీ చెప్పారు. వర్షాకాల సీజన్ కూడా ప్రారంభమ‌వడంతో మిడతల ముప్పు మరింత పెరగవచ్చునని పేర్కొన్నారు. మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండి దీన్ని నుంచి బ‌య‌ట‌ప‌డ‌దామ‌ని పిలుపునిచ్చారు.