Begin typing your search above and press return to search.

దేశం కరోనాతో కాలిపోతుంటే.. ఫార్మా ప్రముఖులతో భేటీనా మోడీ?

By:  Tupaki Desk   |   19 April 2021 12:31 PM GMT
దేశం కరోనాతో కాలిపోతుంటే.. ఫార్మా ప్రముఖులతో భేటీనా మోడీ?
X
ఎలాంటి ఆశలు.. అంతకు మించిన వాంఛలన్నవి లేనట్లుగా ఉంటూ.. సాదాసీదా జీవితాన్ని అనుభవించేస్తారన్న పేరున్న మోడీకి ఏదైనా బలహీనత.. వ్యామోహం లాంటివి ఉన్నాయంటే.. అది బీజేపీ చేతుల్లో అధికారం ఉండాలనుకోవటమే. అందుకోసం ఆయన దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. మిగిలిన రాష్ట్రాల్ని పక్కన పెడితే.. బెంగాల్ లో అధికార దండం తమ పార్టీ చేతిలో ఉండాలన్న ఆయన కోరికకు.. ఈ రోజు యావత్ దేశం మూల్యం చెల్లిస్తుందని చెప్పాలి. గత ఏడాది కరోనా జాడలు కనిపించినంతనే.. లాక్ డౌన్ విధించిన మోడీ మాష్టారు.. ఈసారి సెకండ్ వేవ్ జడలు విప్పి.. చెలరేగిపోతున్న వేళలోనూ.. పట్టనట్లుగా ఎందుకు వ్యవహరించినట్లు? అన్నది అసలు ప్రశ్న.

ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు.. అందునా బెంగాల్ రాష్ట్రంలో సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ కూడా సెకండ్ వేవ్ ఇంత తీవ్ర స్థాయికి చేరటానికి ఒక కారణంగా చెప్పక తప్పదు. బెంగాల్ లో ఏదోలా అధికారాన్ని సొంతం చేసుకోవటానికి ఏమేం చేయాలన్న దానిపై.. పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న మోడీషాలకు.. ఆ రాష్ట్రం తప్పించి.. దేశంలో కరోనా చెలరేగిపోతున్నది పట్టలేదని చెప్పాలి.
బెంగాల్ లో ఎన్నికల ప్రక్రియ ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి రావటం.. కేసుల తీవ్రత పెరిగిపోవటం.. పరిస్థితి నానాటికి దిగజారిపోవటంతో పాటు.. ఎప్పుడూ లేని రీతిలో సోనియా అదే పనిగా వినతులు చేయటం.. మాజీ ప్రధాని మన్మోహన్ లేఖ రాయటంతో పాటు.. దేశంలో నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితితో.. మోడీ వారి ఎన్నికల మత్తు వీడిపోయినట్లు కనిపిస్తోంది.

ఈ రోజు అత్యవసర సమావేశాలకు తెర తీసిన ఆయన.. వైద్య ప్రముఖులు.. ఫార్మా కంపెనీలతో ఆయన భేటీ అవుతున్నారు. నిజానికి.. ఇదంతా ఎప్పుడు చేయాల్సింది? వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసిన దేశం.. ఇప్పుడు దిగుమతి చేసుకునే దయనీయ పరిస్థితులకు చేరుకోవటమే కాదు.. దేశంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను.. పరిశ్రమలకు కాకుండా ఆసుపత్రులకు కేటాయించటం చూస్తే.. దేశ ఆరోగ్య చక్రం గతి తప్పిన వైనం కళ్ల ముందు కదలాడటం ఖాయం. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఎలా స్పందించాలో అర్థం కాని మోడీ వీరాభిమానులకు ఇక పండుగే. వరుస భేటీలతో ఒళ్లు విరుచుకున్న మోడీ మాష్టారి నిర్ణయాల్ని కీర్తించటానికి.. ఆయన ఘన కీర్తిని పొగిడేందుకు మోడీ పరివారం.. ఆయన వీరాభిమానులు డప్పులకు పట్టిన దుమ్ము దులిపేయాల్సిన సమయం వచ్చేసింది.. మోడీ ఘనకీర్తిని చాటేందుకు ఆ మాత్రం ఏర్పాట్లు చేసుకోకపోతే ఏం బాగుంటుంది?