Begin typing your search above and press return to search.

పథకాలు ప్రకటించడంలో మోడీ నంబర్ 1.. మరీ అమల్లో?

By:  Tupaki Desk   |   2 July 2021 3:30 PM GMT
పథకాలు ప్రకటించడంలో మోడీ నంబర్ 1.. మరీ అమల్లో?
X
‘ఎడారిలో ఒయాసిస్సు కనిపిస్తుందేమో కానీ.. మోడీ సార్ పథకాల్లో నేరుగా లబ్ధి మాత్రం కానరాదని’ రాజకీయవర్గాల్లో ఓ విమర్శ ఉంది. ఆ విమర్శ అక్షరాల నిజమేనన్న వాదన వినిపిస్తోంది. మోడీ సార్ కరోనా తొలి నాళ్లలో 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. ఆ తర్వాత ఎన్నో ప్యాకేజీలు ప్రకటించినా ప్రజలకు నేరుగా ఉపయోగపడ్డవి.. వారికి నేరుగా లబ్ధి చేకూర్చినవి ఏవీ లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సార్ గొప్ప సందేశం ఇచ్చేశాడు.. కరోనా విలయకాలంలో ప్రజల్ని గాలికొదిలేశారని ఆరోపణలు ఎదుర్కొన్న సార్.. ఇప్పుడు విలయం ముగిశాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆరోగ్య రంగానికి వరాలు కురిపించారు. ఆ వరాలు ప్రజలు చేరి.. ఫలితం వస్తేనే పండుగ.. గత కరోనా టైంలోనూ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అవి ఎటుపోయాయో తెలియదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వైద్య రంగానికి తాజాగా రూ.50వేల కోట్ల అప్పు హామీ పథకం ఇచ్చాడు. ఇది అమలు అవుతుందా? పాత పథకాలలాగానే ప్రకటించి మరిచిపోతారా? అన్నది వేచి చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. వైద్యులు భగవంతుడి ప్రతిరూపాలని గొప్ప గొప్ప డైలాగులు వల్లెవేశారు. మన ప్రాణాలను కాపాడుతున్న దేవుళ్లు అని చెప్పుకొచ్చాడు. విశ్రాంతి లేకుండా ప్రజల ప్రాణాలనుకాపాడారని.. వైద్యులు ప్రాణాలు కోల్పోయారని.. వారి త్యాగం దేశం గుర్తుంచుకుంటుందన్నారు. భారత ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు.

అంతే వరకు బాగానే ఉంది. వారికి అప్పు కింద పథకం పెట్టడం వరకూ ఓకే.కానీ చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియానో.. నేరుగా సాయం చేసేందుకు మోడీకి మనసు రాలేదు. ఇక ఈ పాపం అంతా గత కాంగ్రెస్ ప్రభుత్వాలది అని.. వైద్యరంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో మోడీ సార్ ఏం చేశాడని.. రెండో వేవ్ లో దేశంలోని జనాలు పిట్టల్లా రాలుతుంటే చోద్యం చూశాడన్న ఆరోపణలున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ తగ్గాక.. ప్రజలంతా ప్రాణాలు కోల్పోయాక చావుకబురు చల్లాగా చెప్పినట్టు మోడీ సార్ ‘రూ.50వేల కోట్లతో రుణహామీ పథకం ’ ప్రకటించడంపై విశ్లేషకులు మండిపడుతున్నారు. చనిపోయిన వారికి.. బాధితులను ఆదుకునే పథకం కాదిది. ఇక ఇప్పటికిప్పుడు వైద్యులకు సాయం చేసే పథకమూ కాదు.. కేవలం వారికి అప్పులిచ్చి రుణాలు కట్టుకోమనే పథకం. దీనిపై వైద్యులలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి.

మోడీ సార్ పథకాలు ఎన్నో ప్రకటిస్తారని.. గొప్పగా మీడియాలో చాటుకుంటారని.. పథకాలు ప్రకటించడంలో అసలు మోడీనే నంబర్ 1 అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే అవి అమలు అవుతున్నాయా? ‘‘ఆ పథకాలతో ఉపయోగం ఏమిటీ అనేది మాత్రం మమ్మలను అడగకండి .. మాకు తెలియదు ’’ అన్నట్టుగా మోడీ సర్కార్ పాలన తీరు ఉంటుందని విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు, వైద్యులకు ఎవరికైనా నేరుగా లబ్ధి చేకూర్చేలా పథకాలురూపొందించాలని మోడీ సార్ ను ప్రజలంతా కోరుతున్నారు.