Begin typing your search above and press return to search.

ట్రంప్‌ ను క‌లిసిన మోడీజీ విష‌యం మరిచారా!

By:  Tupaki Desk   |   27 Jun 2017 4:36 PM GMT
ట్రంప్‌ ను క‌లిసిన మోడీజీ విష‌యం మరిచారా!
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ఇరుదేశాల మ‌ధ్య దౌత్య సంబంధం ప‌రంగా విజ‌య‌వంతం అయింద‌నే దాంట్లో ఎలాంటి సందేహం లేద‌ని అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు - ప‌లువురు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఒక్క విష‌యం, అది కూడా అత్యంత కీల‌క‌మైన అంశంలో మోడీజీ ఆకాంక్ష‌ల‌కు త‌గిన విధంగా న‌డుచుకోలేక‌పోయార‌ని ఆక్షేపిస్తున్నారు. అదే భార‌తీయ ఐటీ ప‌రిశ్ర‌మ కళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్న హెచ్-1 బి వీసాల అంశం. ఈ కీల‌క అంశాన్ని ప‌రిష్క‌రించ‌డాని త‌గిన ప్ర‌య‌త్నం చేయ‌డంలో మోడీ విఫ‌ల‌మ‌య్యార‌ని ప‌లు వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంటకు మోడీ వైట్‌ హౌస్‌ కు చేరుకున్నారు. ట్రంప్‌-మెలానియా దంపతులు మోడీని ఆహ్వానించారు. షేక్ హ్యాండిచ్చి ఆత్మీయంగా పలుకరించారు. రెండు నిమిషాల పాటు మేయిన్‌ గేట్‌ దగ్గర యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఓవెల్‌ రూంకు చేరుకున్న మోడీ తనకు లభించిన గౌరవంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ గౌరవం తనకు లభించింది మాత్రమే కాదని ,125 కోట్ల భారతీయులదని మోడీ చెప్పారు. తర్వాత ఓవెల్‌ రూం ఆవరణలో ట్రంప్‌ - మెలినియాతో కలిసి ఫోటోలకు మోడీ ఫోజులిచ్చారు.

ఈ సంద‌ర్భంగానే వైట్‌ హౌజ్‌ లోని కేబినెట్‌ రూంలో భారత్‌- అమెరికా ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోడీ - ట్రంప్‌ పలు కీలక అంశాలపై చర్చించారు. మిలటరీ సామాగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నందుకు ట్రంప్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ప్రధాని మోడీ స్పందిస్తూ అత్యంత పురాతన ప్రజాస్వామిక దేశం అమెరికా, అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్‌ ల మైత్రి మరింత బలపడిందని మోడీ అన్నారు. అనంతరం వైట్‌ హౌస్‌ లోనే మోడీ - ట్రంప్‌ డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత అమెరికా పర్యటన ముగించుకొని మోడీ నెదర్లాండ్స్‌ బయల్దేరారు.

అయితే ఈ భేటీ సంద‌ర్భంగా అత్యంత కీల‌క‌మైన హెచ్‌1బీ వీసాల అంశం ప్ర‌స్తావ‌న‌కు రాలేదు. మోడీ భేటీలో అత్యంత ఆస‌క్తి రేకెత్తించిందే ఈ అంశం. అయితే ట్రంప్‌ తో స‌మావేశానికి ముందే హెచ్‌1బీ వీసా అంశాన్నిలేవనెత్తే నిర్దిష్ట ఆలోచన ఏదీ తమకు లేదని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హెచ్-1బి వీసాల అంశాన్ని సమీక్షలో ఉంది, ఇప్పుడున్న విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని శ్వేతసౌధం అధికారి ఒకరు తెలిపారు. చర్చల్లో వీసా (హెచ్ 1బి) అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తే ఆలోచన ఏదీ లేదని, భారత్‌ కనుక ఆ అంశాన్ని ప్రస్తావిస్తే దానికి సమాధానమిచ్చేందుకు అమెరికా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాగైన ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తార‌ని, ఐటీ ప‌రిశ్ర‌మ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే ప్ర‌క‌ట‌న‌ను ఈ భేటీ ద్వారా సాధిస్తార‌ని ఆకాంక్షించారు. కానీ అలాంటి ప్ర‌క‌ట‌న ఏమీ రాక‌పోవ‌డంతో ఐటీ ప‌రిశ్ర‌మ నిరాశ‌లో కూరుకుపోయింది. ట్రంప్‌తో భేటీ, సుదీర్ఘ సమ‌యం జ‌రిపిన సంభాష‌ణ‌లో కీల‌కమైన అంశానికి ప‌రిష్కారం చూప‌లేక‌పోయార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/