Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు ఫ‌లితం ఏది మోడీ జీ?

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:30 PM GMT
నోట్ల ర‌ద్దు ఫ‌లితం ఏది మోడీ జీ?
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అనూహ్య రీతిలో ప్ర‌క‌టించిన‌ పెద్దనోట్ల రద్దుకు రేపటితో ఏడాది. గత ఏడాది నవంబర్ 8న ప్రధానమంత్రి చెలామణిలో ఉన్న రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా యావత్ దేశం విస్తుపోయింది. అయితే నల్లధనం అరికట్టడానికి - నకిలీనోట్లకు అడ్డుకట్టవేయడానికి ఈ నిర్ణయం అనివార్యమైందంటూ మోదీ చెప్పిన మాటల్ని అర్థంచేసుకున్న సగటు భారతీయుడికి ఏడాది అనుభవం అనేక పాఠాల్ని నేర్పింది. రద్దయిన నోట్లు ఖాతాల్లో వేసుకోవడం - మానసిక ఆందోళన - చిల్లర కష్టాలు - ఖాళీ ఏటీఎంలు - రూ.2000 నోటు కోసం రాత్రీపగలు బారులు తీరడం.. ఇవన్నీ ఆరునెలల వరకూ సర్వసాధారణమైన దృశ్యాలయ్యాయి.

అయితే ఈ మొత్తం సాధారణ ప్రజానీకానికి అంతులేని కష్టాల్ని ప్రత్యక్షంగా చూపించిన నోట్ల రద్దు - ప్రభుత్వానికి మాత్రం పన్ను ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. ఆర్థిక వ్యవహారాల్లో జవాబుదారీతనం తెచ్చింది. అందరినీ పన్ను పరిధిలోకి తేగలిగామని ప్ర‌ధాని చెబుతున్నారు. ఇంతకీ డిమానిటైజేషన్ దేశాన్ని మార్చిందా? ఏ మార్పూ తీసుకురాలేకపోయిందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. డిమానిటైజేషన్ తర్వాత చెలామణిలో ఉన్న 15.44 లక్షల కోట్ల కరెన్సీ నోట్లలో మూడోవంతు బ్యాంకులకు తిరిగిరాలేదని కేంద్రం మొదట్లో సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ, చివరకు చెలామణిలో ఉన్న నోట్లల్లో 99శాతం బ్యాంకులకు తిరిగి చేరాయి. దాదాపు చెలామణిలో ఉన్న సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లోకి చేరిపోయినట్లే. అయితే నోట్లరద్దు నల్లధనాన్ని ఎక్కడ తుడిచివేసిందన్న ప్రశ్న సగటు భారతీయుడిలో రేకెత్తింది. దానికి తగిన సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానిది అని ఆమ్‌ స్టార్‌ డామ్‌ లోని ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్‌ కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త అర్జెన్‌ వాన్ డిజ్‌ ఖుయ్జెన్ తెలిపారు.

ఇక కీల‌క‌మైన అంశం పన్ను ఎగవేత. బ్యాంకులకు చేరిన డిపాజిట్లను ఒక్కొక్కదాన్ని పరిశీలించి పన్ను ఎగవేతదారుల్ని గుర్తిస్తామని నోట్లరద్దు తొలినాళ్లలో ప్రభుత్వం తెలిపింది. ఆదాయపన్ను దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య 5శాతానికి మించి లేని దేశంలో నిజంగానే డిమానిటైజేషన్ విస్తృత ప్రయోజనాలందిస్తుందని అందరూ ఆశించారు. అవినీతిని సమూలంగా తొలిగించేందుకు ప్రభుత్వం ఎన్నిరకాల చర్యలు తీసుకోగలదో కేం ద్రం చేసి చూపించింది. ఆ దిశగా ప్రజల దృక్కోణంలోనూ మార్పులు వచ్చాయి అని యూరేషియా గ్రూప్ సీనియర్ అనలిస్ట్ శైలేశ్ కుమార్ తెలిపారు. ఫలితాలకన్నా నోట్లరద్దు యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించేందుకు ఎక్కువగా ఉపయోగపడిందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.

మ‌రోవైపు డిజిటలైజేషన్ ఊపందుకుంది. ప్రధాని మోడీ చర్యల వల్ల డిజిటల్ చెల్లింపుల సంస్థలకు మంచి ఊతం లభించింది. అన్నింటికన్నా చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ నగదుచెల్లింపుల సంస్థ పేటీఎం అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందింది. డిమానిటైజేషన్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ - ఈక్విటీ మార్కెట్లలోకి నగదు ప్రవాహం భారీగా పెరిగింది. నగదు రహిత సేవల విస్తృతి పెరుగడాన్ని ప్రభుత్వం విజయంగా ప్రకటించుకున్నది. నల్లధనం నగదురూపేణా నిల్వచేయడమనేది గణనీయంగా తగ్గింది అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ అభిప్రాయపడ్డారు. అత్యంత కీల‌క‌మైన ఉగ్రవాదం విష‌యంలో.. నోట్లరద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌ లో రాళ్లు రువ్వుతున్న ఘటనలు గణనీయంగా తగ్గిపోయాయి. కానీ, కొద్దిరోజులకే అవి మళ్లీ మొదలయ్యాయి. దీన్నిబట్టి ఉగ్రవాదానికి - పెద్దనోట్లకు సంబంధముందన్నది ఎలాంటి ధ్రువీకరణకు నోచుకోని అనుమానంగానే మిగిలిపోయింది. స్థూలంగా మ‌ధ్య త‌ర‌గ‌తి ఆశించింది ఒక‌టైతే...స‌ర్కారు ప్ర‌చారం ఒక‌టి..ప్ర‌జ‌ల‌కు అందింది మ‌రొక‌టి అంటూ ప‌లువురు నిట్టూరుస్తున్నారు.