Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్లోకి ఈ ముగ్గురిలో ఒకరు!

By:  Tupaki Desk   |   3 Aug 2017 6:05 AM GMT
మోడీ కేబినెట్లోకి ఈ ముగ్గురిలో ఒకరు!
X
కేంద్ర కేబినెట్‌లో కీల‌క స్థానాల్లో ఖాళీలు ఏర్ప‌డ‌టం....రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో కేబినెట్‌ ను విస్త‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త...కేంద్ర ప్ర‌భుత్వం క‌దలిక‌ల నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీల‌లో మ‌రోమారు మంత్రి ప‌ద‌వుల ఆశ‌లు మొద‌లుతున్నాయ‌ని అంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం నెలాఖరుకు కేంద్ర కేబినెట్‌ లో మార్పులు చేర్పులు చేపట్టేందుకు ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీకి చెందిన ఎంపీలు ఈ ప‌రిణామాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్నట్లు స‌మాచారం. కేంద్ర కేబినెట్ నుంచి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ గోవా సీఎంగా వెళ్లారు. పర్యావరణ - అటవీ మంత్రి అనీల్‌ మాధవ్ దవే మరణించారు. పట్టణాభివృద్ధి - సమాచార మంత్రి వెంకయ్యనాయుడు ఉప రాష్టపతిగా వెళ్తున్నారు. మ‌రోవైపు, సమర్థంగా పనిచేయని కొందరు మంత్రులను తొలగించేందుకు ప్ర‌ధాని మోడీ సిద్ధమవుతున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దేశవ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు, 2019లో జరిగే లోక్‌ సభ - కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకెను సైతం కేబినెట్‌ లోకి తీసుకోవచ్చని చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలోవున్న తెరాసతోనూ భాజపా మంతనాలు సాగిస్తోందన్న మాట వినిపిస్తోంది. అన్నాడీఎంకెకు చెందిన లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకు కేబినెట్ మంత్రి హోదా ఇచ్చి - అన్నాడీఎంకెలోని రెండు వర్గాల నుండి ఒక్కొక్కరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే తెలుగుదేశం సభ్యులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. బీజేపీ - తెలుగుదేశం పార్టీల స‌ఖ్య‌త‌పై ఇటీవ‌లి కాలంలో కొంత సందేహాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే పొత్తు యథాతథంగా కొనసాగే పక్షంలో తెదేపాకు చెందిన ఒకరికి సహాయ మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం తెలుగదేశం పార్టీకి చెందిన అశోక్‌ గజపతి రాజు కేబినెట్ మంత్రిగా పనిచేస్తుంటే, సుజనాచౌదరి సహాయ మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. తాజా విస్త‌ర‌ణ‌లో ఆశావ‌హులుగా లోక్‌ సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం - సీనియర్ ఎంపీ కొనక‌ళ్ల నారాయణ - రాయలసీమకు చెందిన మరో సీనియర్ ఎంపీ నిమ్మల కిష్టప్ప పోటీ పడుతున్నట్టు సమాచారం. ఆంధ్రలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించిన కమలనాథులు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల ఆధారంగానే మంత్రి ప‌ద‌వులు కేటాయించ‌నున్న‌ట్లు స‌మాచారం.