Begin typing your search above and press return to search.

నాట‌కీయ ఫోటోల‌కే మోడీ ఫారిన్ టూర్లు?

By:  Tupaki Desk   |   3 Jun 2018 4:33 AM GMT
నాట‌కీయ ఫోటోల‌కే మోడీ ఫారిన్ టూర్లు?
X
నాట‌కీయంగా వ్య‌వ‌హ‌రించ‌టం ప్ర‌ధాని మోడీకి తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. విదేశీ ముఖ్యుల‌తో ఆయ‌న వ్య‌వ‌హ‌రించే తీరును ఒక్క‌సారి గుర్తు తెచ్చుకోండి. గ‌తంలో ప్ర‌ధానులుగా ప‌ని చేసిన వారెవ‌రూ వ్య‌వ‌హ‌రించిన రీతిలో ఆయ‌న తీరు క‌నిపిస్తుంది. విదేశీ ముఖ్య‌లు ఎవ‌రైనా దేశానికి వ‌చ్చినా.. లేదంటే ప్ర‌ధానే ఆయా దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ప్ర‌ధాని దేశాధ్య‌క్షుడ్ని క‌లిసిన‌ప్పుడు వారితో భేటీకి సంబంధించిన ఫోటోలు మీడియాలో ప‌బ్లిష్ అవుతుంటాయి. కానీ.. మోడీ మార్క్ మాత్రం వేరేలా ఉంటుంది.

ఒక దేశాధ్య‌క్షుడితో ప‌డ‌వ‌లో మంత‌నాలు ఆడుతున్న‌ట్లుగా.. పార్కులో తిరుగుతూ మాట్లడ‌టం.. ఇంకొక‌రితో టీ తాగుతూ ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న ఫోటోలు ప‌బ్లిష్ అవుతుంటాయి. ఇష్యూను డ్ర‌మ‌టైజ్ చేయ‌టంలో మోడీ త‌ర్వాతే ఎవ‌రైనా. గ‌డిచిన పాతికేళ్ల‌లో ఎప్పుడూ లేనంత దారుణంగా విదేశాంగ విధానంలో భార‌త్ ఫెయిల్ అయ్యింది మోడీ హ‌యాంలోనే అన్న మాట‌ను విదేశీ వ్య‌వ‌హారాల్ని అధ్య‌య‌నం చేసే ప్ర‌ముఖులు చెబుతుంటారు.

గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో మోడీ చేసిన త‌ప్పులు అన్ని ఇన్ని కావ‌ని చెబుతారు. ఆయన అవ‌గాహ‌నా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రితో భార‌త్ త‌న ప్ర‌త్యేక‌త‌ను కోల్పోయింద‌ని.. త‌న చుట్టూ ఉన్న మిత్రుల్ని సైతం శ‌త్రువుల్ని చేసుకుంద‌న్న విమ‌ర్శ వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు నేపాల్ చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెబుతుంటారు. మిత్ర దేశంగా ఉన్న నేపాల్ తో సంబంధాలు క్షీణించేలా చేసుకున్న ఘ‌న‌త మోడీకే ద‌క్కుతుంద‌ని చెబుతారు.

చైనాతో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. తొంద‌ర‌పాటుతో ఆ దేశంతో ఉన్న సంబంధాల్ని మ‌రింత ప‌లుచ‌న చేసుకోవ‌టం మ‌ర్చిపోకూడ‌దు. డోక్లాంను దేశ ప్ర‌జ‌ల‌కు చూపించింది ఒక‌టైనా.. ఈ ఎపిసోడ్ తో చైనాతో సంబంధాలు మ‌రింత త‌గ్గిపోయి.. అందుకు ప్ర‌తిగా ఆక్ర‌మిత క‌శ్మీర్‌ లో అంత‌ర్జాతీయ రోడ్డును వేసేలా చైనాను పురికొల్పింద‌ని చెప్పాలి. నాలుగేళ్ల కాలంలో విదేశీ వ్య‌వ‌హారాల్లో భార‌త్ మార్క్ క‌నిపించింది లేదు. వ‌రుస‌గా విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన మోడీ.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లు ఆయా దేశాల్లోని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు చిరాకు తెప్పించిన‌ట్లుగా చెబుతారు. త‌న ఇమేజ్ ను పెంచుకోవ‌టం త‌ప్పించి.. దేశ ప్ర‌యోజ‌నాలు మోడీకి పెద్ద‌గా ప‌ట్ట‌వ‌న్న మాట నిజ‌మ‌న్న విమ‌ర్శ అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. మోడీ టూర్ల కార‌ణంగా వంద‌ల కోట్లు ఖ‌ర్చు కావ‌టానికి మించిన డ్యామేజ్ జ‌రుగుతోంద‌ని.. దీనికి భ‌విష్య‌త్తులో మ‌రింత మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని విదేశాంగ వ్య‌వ‌హ‌రాల్ని అధ్య‌య‌నం చేసే నిపుణుల హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి.. ఇలాంటి విమ‌ర్శ‌ల‌పై బీజేపీ థింక్ టాంక్ ఎలాంటి వాద‌న‌ను వినిపిస్తుందో చూడాలి.