Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ ఏర్పాటు పంచ్ వేసిన మోడీ

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:19 AM GMT
ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ ఏర్పాటు పంచ్ వేసిన మోడీ
X
అందుకే అంటారు.. ప్రొసీజర్ ప్రకారం చేయకుంటే ఎప్పటికైనా తిప్పలు తప్పవని. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన పనుల్ని.. తమ స్వార్థం కోసం.. అవసరం కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులు చేతిలో పవర్ ఉన్నప్పుడు అనుకున్నట్లే సాగినా.. తర్వాత మాత్రం కొత్త తిప్పలు తప్పవు. తప్పు చేస్తే అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయం.. తాజాగా ప్రధాని మోడీ మాటలు విన్నంతనే ఇట్టే అర్థమవుతాయి. అంతేకాదు.. తాము చేసిన తప్పుల్ని ఎత్తి చూపటం ద్వారా కాంగ్రెస్ నేతలకు నోట మాట రాకుండా చేయటంలో ప్రధాని సక్సెస్ అయ్యారని చెప్పాలి.

ఆర్టికల్ 370 నిర్వీర్యం మీద కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ మోడీ సర్కారును ఇరుకున పడేసే ప్రయత్నం చేయగా.. ఆయనకు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు మోడీ. ఆర్టికల్ 370 నిర్వీర్యం మీద చర్చే జరగలేదని గులాం నబీ అజాద్ అంటున్నారని.. తాను అడుగుతున్నది ఒక్కటేనని.. 2014లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు చేసినప్పడు సభలో చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు.

పార్లమెంటును బంద్ చేసి.. చర్చకు కత్తెరవేశారని.. ఇప్పుడేమో ఆర్టికల్ 370 మీద మాత్రం రచ్చ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నాడు ఏపీ విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినప్పుడు.. ఆ సమయంలో జరిగిన నిరసనల్ని నాటి ప్రధాని మన్మోహన్ తప్పు పట్టిన వైనాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. నాడు జరిగిన నిరసనల్ని తప్పు పట్టిన కాంగ్రెస్.. నేడు అలాంటి నిరసల్ని సమర్థిస్తుందని పంచ్ వేశారు.

పార్లమెంటులో సమగ్ర చర్చ జరిగిన తర్వాతే కశ్మీర్ పై నిర్ణయానికి ఆమోదముద్ర వేశామన్న మోడీ.. ప్రధాని పదవి కావలన్న ఒకరి ఆకాంక్ష కోసం దేశ మ్యాపులో ఒక గీత గీసి దేశాన్ని విడగొట్టారంటూ తొలి ప్రధాని నెహ్రూ మీద భారీ విమర్శ చేసి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు.