Begin typing your search above and press return to search.

మోడీ బ్యాచ్ లో వేటు ప‌డేది వీరి మీదేన‌ట‌

By:  Tupaki Desk   |   24 Aug 2017 4:16 AM GMT
మోడీ బ్యాచ్ లో వేటు ప‌డేది వీరి మీదేన‌ట‌
X
అనుకున్న స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్లే. కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న కేంద్ర కేబినెట్‌ ను పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేసేందుకు రంగం సిద్ధ‌మైంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల టీంను ఎంపిక చేసుకోవ‌టంలో ప్ర‌ధాని మోడీ.. ఆయ‌న అనుంగ మిత్రుడు అమిత్ షాలు గ‌డిచిన కొద్దిరోజులుగా క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది నెల‌లుగా వారు టార్గెట్ గా పెట్టుకున్న జేడీయూ.. అన్నాడీఎంకేల ఇష్యూలు కొలిక్కి తీసుకురావ‌టంతో పాటు.. మంత్రివ‌ర్గంలో ఆ రెండు పార్టీల‌కు చోటు క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మైన గ్రౌండ్‌ ను ప్రిపేర్ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ).. త‌మిళ‌నాడు అధికార ప‌క్ష‌మైన అన్నాడీఎంకేకు చోటు క‌ల్పించ‌నున్నారు. జేడీ(యూ)కు ఒక కేబినెట్ తో పాటు ఒక స‌హాయ‌మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌నున‌నారు. అన్నాడీఎంకేకు ఒక కేబినెట్ తో పాటు రెండు స‌హాయ‌మంత్రి ప‌ద‌వులు ల‌భించ‌నున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే ప‌ని చేస్తున్న వారిలో కొందరికి ప్ర‌మోష‌న్ ఇవ్వ‌టంతోపాటు.. ప‌ని తీరు బాగా లేని మ‌రికొంద‌రికి డిమోష‌న్ ఇచ్చేందుకు లెక్క ప‌క్కా అయిందని చెప్పొచ్చు.

కేంద్ర కేబినెట్ ను సెట్ చేయ‌టంతో పాటు.. కొద్ది నెల‌లుగా కొన్ని రాష్ట్రాల‌కు పూర్తిస్థాయి గ‌వ‌ర్న‌ర్లు లేని నేప‌థ్యంలో ఆ లోటును భ‌ర్తీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఉన్న నేప‌థ్యంలో.. ఈసారి అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాల‌కు ఇద్ద‌రు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్ల‌ను ఎంపిక చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇక‌.. ప్ర‌మోష‌న్ లు పొందే కేంద్ర‌మంత్రుల జాబితాలో.. పీయూష్ గోయిల్‌.. ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్‌.. రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్‌.. ప్ర‌కాశ్ జావ‌డేక‌ర్‌.. జితేంద్ర‌సింగ్ ల‌కు ప‌దోన్న‌తి ల‌భించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో ప‌ని తీరు ఏ మాత్రం బాగోలేని త‌న కేబినెట్ స‌హ‌చ‌రుల‌పై వేటు వేయాల‌ని మోడీ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివ‌ర్గంలో ప‌ద‌వులు కోల్పోయే వారి జాబితాలో క‌ల్ రాజ్ మిశ్రా.. రాజీవ్ ప్రతాప్ రూఢీ.. నిర్మ‌లా సీతారామ‌న్‌.. న‌డ్డా.. కృష్ణ‌రాజ్‌.. సంజీవ్ కుమార్ బ‌ల్యాన్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వ‌రుస రైలు ప్ర‌మాదాల‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సురేశ్ ప్ర‌భు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించ‌టం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న రాజీనామాను ఆమోదించ‌కుండా బుజ్జిగిస్తున్న‌ప్ప‌టికీ.. కేబినెట్ ప్ర‌క్షాళ‌న స‌మ‌యంలో ఆయ‌న రాజీనామాను అంగీక‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇక‌.. గ‌వ‌ర్న‌ర్ల రేసులో వినిపిస్తున్న పేర్ల విష‌యానికి వ‌స్తే.. మంత్రివ‌ర్గం నుంచి ఉద్వాస‌న‌కు గుర‌య్యే కొంద‌రికి గ‌వ‌ర్న‌ర్ గిరి ల‌భించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌వ‌ర్న‌ర్లుగా ఎంపిక‌య్యే వారి పేర్ల‌లో క‌ల్ రాజ్ మిశ్రా.. లాల్జీ టాండ‌న్‌.. విజ‌య్ కుమార్ మ‌ల్హోత్రా.. కైలాష్ జోషి.. సీపీ ఠాకూర్‌.. ఆనందీబెన్ ప‌టేల్‌.. జితిన్ రాం మాంఝీ.. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌కు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్లు వేర్వేరుగా ఏర్పాటు చేస్తార‌ని చెబుతున్నారు. ఇక‌.. బిహార్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. త‌మిళ‌నాడు.. తెలంగాణ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. మేఘాల‌య‌.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌తో పాటు దాద‌ర్ అండ్ న‌గ‌ర్ హ‌వేలీ కేంద్ర పాలిత ప్రాంతానికి గ‌వ‌ర్న‌ర్లుగా అద‌న‌పు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్నారు. కొత్తగా ఎంపిక చేసే గ‌వ‌ర్న‌ర్లతో మొత్తం ఖాళీల్ని భ‌ర్తీ చేసేస్తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.