Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ త‌ల మీదా.. క‌రుణ భుజం మీద‌..!

By:  Tupaki Desk   |   8 Nov 2017 1:30 AM GMT
చిన్న‌మ్మ త‌ల మీదా.. క‌రుణ భుజం మీద‌..!
X
క‌చ్ఛితంగా చెప్ప‌లేం కానీ కొన్నిసీన్లు స్మృతిప‌థంలో అలా ప్రింట్ అయిపోతుంటాయి. అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రి చేరిన అమ్మ‌.. చివ‌ర‌కు తిరిగిరాని లోకాల‌కు వెళ్లిన త‌ర్వాత మాత్ర‌మే ఆమె క‌నిపించారు. అమ్మ మ‌ర‌ణ‌వార్త అంద‌రిని క‌లిచివేసింది. ప్ర‌ధాని మోడీ సైతం ఢిల్లీ నుంచి ప్ర‌త్యేకంగా చెన్నై వ‌చ్చారు.

అమ్మను క‌డ‌సారి ద‌ర్శించుకున్నారు. నివాళులు అర్పించారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంద‌నుకున్న వేళ‌.. మోడీని చూసినంత‌నే భావోద్వేగానికి గురైన అమ్మ నెచ్చ‌లి చిన్న‌మ్మ త‌ల మీద చేయి వేసి స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. అండ‌గా ఉంటామ‌న్న సంకేతాన్ని ఇచ్చారు. అమ్మ అంత్య‌క్రియ వేళ‌.. మోడీ హ‌స్తం.. చిన్న‌మ్మ త‌ల మీద వేసింది అభ‌య హ‌స్త‌మా? వామ‌న హ‌స్త‌మా? అన్న డౌట్ కొంద‌రికి వ‌చ్చింది.

అయితే.. అప్పుడున్న వేళలో అలాంటి సందేహాలు స‌రికావ‌నిపించినా.. త‌ర్వాతి రోజుల్లో చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే.. మోడీ ప్లానింగ్‌కు షాక్ తిన్నోళ్లు ఎంద‌రో. చిన్న‌మ్మ పార్టీకి అండ‌గా ఉంటాన‌న్న మోడీ.. ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే.. ఒక్క‌టిగా ఉన్న పార్టీ మూడు ముక్క‌లు కావ‌టం.. ఇప్పుడు రెండు ముక్క‌లై ఆగ‌మాగం అవుతున్న ప‌రిస్థితి.

అమ్మ మృతితో వెల్లువెత్తే సానుభూతితో మ‌రో ట‌ర్మ్ అధికారం ప‌క్కా అనుకున్నోళ్ల కొంద‌రు ఆశాజీవుల అంచ‌నాలు త‌ప్ప‌ని గ‌డిచిన కొన్ని నెల‌లుగా సాగుతున్న పంచాయితీని చూస్తే అర్థ‌మైంది. రానున్న రోజుల్లో అన్నాడీఎంకేకు భారీ ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌ని అనుకుంటున్న వేళ‌.. మ‌రోసారి చెన్నైకి వ‌చ్చిన మోడీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించారు.

దిన‌తంతి మీడియా సంస్థ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న డీఎంకే అధినేత క‌రుణానిధిని ప‌లుక‌రించేందుకు ఆయ‌న నివాసానికి వెళ్లారు. ప్ర‌స్తుతం ఎవ‌రిని గుర్తించ‌లేని స్థితిలో ఉన్న ఆయ‌న చేతిని ప‌ట్టుకున్న మోడీ.. దాదాపు ప‌దినిమిషాల పాటు ఉండిపోయారు. భుజం మీద చేయి వేసిన మోడీ తీరు చూసినంత‌నే చిన్న‌మ్మ నెత్తిని నిమురుతూ భ‌రోసా ఇచ్చిన దృశ్యం చ‌ప్పున గుర్తు కాక మాన‌దు.

అన్నాడీఎంకే మీద ప్ర‌జ‌లు చిరాకు ప‌డిపోతున్నార‌ని.. రానున్న ఎన్నిక‌ల్లో డీఎంకేకు త‌మిళ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టటం ఖాయ‌మ‌నుకున్న వేళ‌.. మోడీ గారి చేయి డీఎంకే పెద్దాయ‌న భుజం మీద ప‌డ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళ కోట‌లో కాషాయ‌జెండాను పాతాల‌ని త‌పించే మోడీ.. తాజాగా క‌రుణ ఇంటికి రావ‌టం.. అక్క‌డ ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు రాజ‌కీయంగా ప‌లు అంచ‌నాల‌కు వేదికైంది.

ఎప్ప‌టిలానే క‌రుణ రాజ‌కీయ వార‌సుడు స్టాలిన్ మాత్రం మోడీ ఇంటికి రావ‌టానికి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌న్నారు. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. డీఎంకేలో రానున్న రోజుల్లో ఎలాంటి చీలిక‌లు రాక‌పోతే చాల‌న్న మాట‌ను కొంద‌రు వ్యంగ్యంగా వ్యాఖ్యానించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.