Begin typing your search above and press return to search.

సీనియర్ సిటిజన్స్ కూడా వదిలేటట్లు లేరుగా మోడీ

By:  Tupaki Desk   |   27 Jun 2016 6:54 AM GMT
సీనియర్ సిటిజన్స్ కూడా వదిలేటట్లు లేరుగా మోడీ
X
మోడీ మార్క్ వ్యవహారం ఒకటి తెర మీదకు వచ్చింది. సాదాసీదా ప్రజానీకానికి ఇచ్చే అరకొర సౌకర్యాల్ని సైతం లాగేసుకునే తత్వం మోడీకి మాత్రమే సొంతం. ఇలాంటి సౌకర్యాల విషయాన్ని టచ్ చేయటానికి ప్రభుత్వాలు సాధార ణంగా ఇష్టపడవు. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా ఉంటాయి. కానీ.. మోడీ మాత్రం అందుకు భిన్నం. తనదైన శైలిలో ప్రచారం మొదలెట్టి.. చివరకు మొత్తానికి మంగళం పాడటం అలవాటే. తాజాగా అలాంటి కార్యక్రమమే ఒకటి మొదలైంది.

మోడీ వచ్చిన తర్వాత రైల్వేల తీరు చాలానే మారింది. ప్రజల మీద తరచూ భారం మోపటం ఒక అలవాటుగా మారింది. ఇదెంత వరకూ వెళ్లిందంటే.. పిల్లలకు కొనే హాఫ్ టికెట్ ను (రిజర్వేషన్ టికెట్ మీద) కూడా ఎత్తేయటం తెలిసిందే. దీనికి కొనసాగింపు చర్య ఒకటి ఇప్పుడు మొదలైంది. అదేమంటే.. సీనియర్ సిటిజన్లకు (పురుషులైతే 60 ఏళ్లు.. మహిళలు అయితే 58 ఏళ్లు. పురుషులకైతే 40శాతం.. మహిళలకైతే 50 శాతం టికెట్ ధరలో రాయితీ) ఇస్తున్న ఛార్జీల రాయితీ మీద మోడీ కన్ను పడింది. టికెట్ ఛార్జీల్లో వారికిచ్చే రాయితీకి ఎసరు తెచ్చే ప్రోగ్రాంను మోడీ సర్కార్ మర్యాదగా మొదలు పెట్టిందని చెప్పాలి.

వివిధ వర్గాల వారికి రాయితీల మీద రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. మొత్తం 55 కేటగిరీల్లో రాయితీ సౌకర్యాన్ని కల్పిస్తుంటే.. సీనియర్ సిటిజన్లది ఇందులో ఒకటి చెప్పాలి. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే టికెట్ రాయితీ కారణంగా ఏడాదికి 1100 కోట్ల రూపాయిల భారం రైల్వే శాఖ మీద పడుతుందని రైల్వే శాఖ లెక్కలు చెబుతోంది. అందుకే.. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని ఎవరికి వారే స్వచ్ఛంధంగా వదులుకోవచ్చు కదా? అంటూ ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ప్రయాణికులకు అందించే సేవలకు ప్రతి ఏటా రైల్వేలకు రూ.34వేల కోట్ల నష్టం వస్తుందని.. ఇలాంటి చర్యలతో నష్టాల్ని పూడ్చుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది.

రూ.34వేల కోట్లలో వయసు మళ్లిన వృద్ధులకు ఇచ్చే వెయ్యికోట్లే పెద్దదిగా కనిపిస్తుందా? వయసు మళ్లిన వారికుండే సమస్యలు అన్ని ఇన్ని కావు. ఓపక్క ఆరోగ్య సమస్యలు.. ఆదాయం లేకపోవటం.. ఎవరో ఒకరి మీద ఆధారపడటం లాంటివెన్నో ఉంటాయి. ఇలాంటి వారికిచ్చే సౌకర్యాలకు ఎర్త్ పెడితే.. వారి మీద భారం భారీగా ఉంటుందన్న విషయాన్ని మోడీ మాష్టారు గుర్తిస్తే మంచిది.. ఒకరి మీద ఆధారపడిన వారిని మోడీ సర్కార్ లక్ష్యంగా చేసుకోకపోతే బాగుంటుంది. అయినా.. చిన్నపిల్లలు.. వయసు మళ్లిన వారికి అందించే సౌకర్యాల విషయంలో కోత పెట్టకుండా మోడీ సార్.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేరా?