Begin typing your search above and press return to search.

అభయ హస్తం కాదు..భస్మాసుర హస్తం!!

By:  Tupaki Desk   |   16 Feb 2017 6:46 AM GMT
అభయ హస్తం కాదు..భస్మాసుర హస్తం!!
X
సరిగ్గా 72 రోజుల క్రితం మాట. యావత్ తమిళనాడు శోకంతో తల్లడిల్లుతోంది. అమ్మను కోల్పోయిన వేదన వారిని అతలాకుతలం చేస్తోంది. ఇలాంటి వేళ.. అమ్మను కడసారి చూసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైలో ల్యాండ్ అయ్యారు ప్రధాని మోడీ. తెల్లటి లాల్చీ.. కుర్తాతో ధరించిన ఆయన.. అమ్మ అంతిమయాత్ర ప్రారంభం కావటానికి కొద్ది నిమిషాల ముందు అక్కడకు వచ్చారు. ఆమె పార్థిపదేహానికి ఒక నమస్కారం చేశారు. మోడీ రావటంతో అక్కడ వాతావరణం ఒక్కసారి మారింది. తీవ్ర ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. అప్పటివరకూ గంభీరంగా ఉన్న అమ్మ నెచ్చెలి శశికళ.. మోడీ దగ్గరకు రాగానే.. అప్రయత్నంగా బరస్ట్ అయ్యారు. శోకంతో తల్లడిల్లారు. ఆ సందర్భంగా ఆమెను ఓదార్చే ప్రయత్నంలో.. అనునయంగా ఆమె తలపైన చేతిని పెట్టారు మోడీ. చాలామంది దాన్నో అభయహస్తంగా అభివర్ణించారు. కట్ చేస్తే..

ఇప్పుడదే సన్నివేశాన్ని గుర్తు చేసుకునే వారంతా.. మోడీది అభయహస్తం ఎంతమాత్రం కాదని.. భస్మాసుర హస్తంగా అభివర్ణించటం కనిపిస్తోంది. అమ్మ మరణం తర్వాత.. తమిళనాడు మీద తమ అధిపత్యాన్ని చెలాయించాలని.. వీలైనంతవరకూ తమ పట్టు బిగించాలని కమలనాథులు కలలు కనటాన్ని కాదనలేం. దేశ పగ్గాలే తమ చేతిలోకి వచ్చిన వేళ.. ఒక రాష్ట్రంపైన తమ పట్టు పెంచుకోవటం.. పగ్గాలు చేజిక్కించుకోవటం అంత కష్టం ఎంతమాత్రం కాదని భావించొచ్చు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది. అందులోకి అమ్మ లాంటి అధినేత్రి దూరమైన వేళ.. తమిళ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవటంతో పాటు.. తమ అధిపత్యానికి అవకాశం లభిస్తుందని భావించటం ఉత్తరాదిరాజకీయాల మీద అవగాహన ఉన్న మోడీ లాంటోళ్లకు అనిపించటం ఖాయం.

ద్రవిడ రాజకీయాలు.. తమిళ ప్రజల తీరు గురించి తెలిసిన వారు మాత్రం.. అదెప్పటికీ సాధ్యమయ్యేపని కాదని చెబుతారు. అయితే.. అలాంటి వాదనల్ని కమలనాథులు పట్టించుకోరనే చెప్పాలి. అందుకేనేమో.. తమ చెప్పుచేతుల్లో ఉంటారనుకున్న చిన్నమ్మ అండ్ కో.. సొంతంగా తమ పనుల్ని చక్కబెట్టుకోవటం కేంద్రానికి నచ్చలేదన్న మాట వినిపిస్తోంది. దీనికి పర్యవసానంగానే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలుగా అభివర్ణించేవారు లేకపోలేదు. ఒకవేళ చిన్నమ్మ కానీ.. తనకు దక్కినదానితో తృప్తి చెంది.. పార్టీ పగ్గాల్ని అందుకోవటంతో ఆగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని.. కానీ..ఆమె సీఎం కుర్చీ మీద పెట్టుకున్న ఆశలు మొదటికే మోసం వచ్చిందని చెప్పక తప్పదు. అదే.. అభయహస్తంగా ఉండాల్సింది కాస్తా.. భస్మాసుర హస్తంగా మార్చిందన్న మాట వినిపిస్తోంది. ఈ అభిప్రాయాన్ని విన్నంతనే అనిపించేది ఒక్కటే.. ఒకరి ఆశ.. మరొకరి ఆకాంక్షను మార్చేసిందని. ఈ కోణంలో ఆలోచించినప్పుడు.. మోడీది అభయహస్తమా? భస్మాసుర హస్తమా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/