Begin typing your search above and press return to search.

బీజేపీది ద్రుత‌రాష్ట్ర కౌగిలి.. బాబు ఏం చేస్తారో..?

By:  Tupaki Desk   |   20 Aug 2022 2:30 AM GMT
బీజేపీది ద్రుత‌రాష్ట్ర కౌగిలి.. బాబు ఏం చేస్తారో..?
X
బీజేపీ క‌న్ను ప‌డిన ఏ పార్టీ కూడా సుదీర్ఘ కాలం మ‌న‌గ‌లిగిన ప‌రిస్థితి లేదు. దేశంలోని అనేక ప్రాంతీయ‌పార్టీల‌ను త‌న‌వైపు తిప్పుకొని.. వాటితో క‌లిసి ప‌నిచేసిన‌ట్టు చేస్తూనే.. వాటిని నాశ‌నం చేయ‌డంతోపాటు.. త‌మ‌లో ఐక్యం చేసుకున్న చ‌రిత్ర బీజేపీకి సొంత‌మ‌ని రాజ‌కీయ మేధావులు త‌ర‌చుగా చెబుతుంటారు. గ‌తంలో గుజ‌రాత్‌లో జ‌న‌తాద‌ళ్ పార్టీతో క‌లిసి పొత్తు పెట్టుకుని.. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ.. త‌ర్వాత‌.. ఆ పార్టీని లేకుండా చేసింది. జ‌న‌తాద‌ళ్ పార్టీ.. ఇప్పుడు గుజ‌రాత్ ఎక్క‌డ ఉంది.. అంటే.. బీజేపీలో విలీనం అయిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుంటాయి.

ఒక్క గుజ‌రాతే కాదు.. బిహార్‌లో ఎల్జీపీ.. అసోంలో గ‌ణ‌ప‌రిష‌త్‌, నాగాలాండ్‌లో నాగా పార్టీ ఇలా అనేక పార్టీల‌ను బీజేపీ స్నేహం చేసిన‌ట్టే చేసి.. వాటి బ‌ల‌హీన‌త‌ల‌ను తెలుసుకుని దెబ్బ‌కొట్టిన ప‌రిస్థితి.. ఆయా పార్టీల‌ను లేకుండా చేసిన ప‌రిస్థితి కూడా.. చ‌రిత్ర‌లో క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే వ్యూహంతో ఏపీలో బీజేపీ ముందుకు సాగుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీని సొంత కాళ్ల‌పై నిల‌ప‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఎంద‌రు నాయ‌కుల‌ను చీఫ్‌లుగా మార్చినా.. ఏపీలో బీజేపీ ప‌రిస్థితి నామ‌మాత్రంగానే ఉంది.

ఇలాంటి స‌మ‌యంలో త‌మ‌ను కోరివ‌స్తున్న పార్టీని క‌లుపుకొని.. చేతులు క‌లిపిన‌ట్టే క‌లిపి.. భ‌విష్య‌త్తులో ఆ పార్టీని త‌మ వ‌శం చేసుకునే య‌త్నాలు బీజేపీ చేసే ప్ర‌మాదం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా వేసే అడుగుల‌ను గ‌మ‌నించాల‌ని అంటున్నారు. ఏపీలో బీజేపీతో జ‌ట్టు క‌ట్టేందుకు టీడీపీ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నం చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీ అంటే ప‌డ‌ని.. ప్ర‌ధాని మోడీ.. తాజాగా పార్టీ అధినేత‌కు ఆహ్వానాలు ప‌లికారు. త‌ర‌చుగా రావాల‌ని కూడా పిలుపునిచ్చారు.

అయితే.. ఇదంతా వ్యూహంలో భాగ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ విధానాల‌ను గ‌మ‌నిస్తే.. అంతో ఇంతో బ‌లంగా ఉన్న టీడీపీని త‌మ‌వైపు తిప్పుకొంటే.. మున్ముందు.. ఆ పార్టీకి ఏర్ప‌డే నాయ‌క‌త్వ లోపాన్ని ఆస‌రా చేసుకుని.. పార్టీలోని నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అంటే.. టీడీపీని త‌మ‌లో విలీనం చేసుకున్నా.. బీజేపీ విష‌యంలో ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అంటున్నారు. ఎలానూ బ‌లంగా ఉన్న వైసీపీని వ‌శం చేసుకునే అవ‌కాశం లేనందున‌.. రాబోయే రోజుల్లో టీడీపీపై వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌ను అనుస‌రించాల‌నే విధానంలో భాగంగానే ఇప్పుడు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.