Begin typing your search above and press return to search.

మోడీ-ప‌వార్ రహ‌స్య మంత‌నాలేంటో?

By:  Tupaki Desk   |   18 July 2021 7:56 AM GMT
మోడీ-ప‌వార్ రహ‌స్య మంత‌నాలేంటో?
X
ఓడ‌లు బండ్ల‌వ‌డం బండ్లు ఓడ‌ల‌వ‌డం.. రాజ‌కీయాల్లో సాధార‌ణ‌మే. నేత‌లు ఎప్పుడు మిత్రులుగా ఉంటారో.. ఎప్పుడు శ‌త్రువుల‌వుతారో ఎవ‌రికీ తెలీదు. సొంత ప్ర‌యోజ‌నాల కోసం పార్టీలు మార‌డం.. రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ప్ర‌త్య‌ర్థుల‌తోనూ చేతులు క‌ల‌పడం నాయ‌కుల‌కు కొత్తేమీ కాదు. ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రితో స‌మావేశం అవుతారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ భేటీ కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ భేటి ప్రాధాన్య‌త సంతరించుకుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌కు ఏకం చేసి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాల్లో శ‌ర‌ద్ ప‌వార్ ఉన్నార‌నే వార్త‌లు ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ దిశ‌గా ఆయ‌న వివిధ పార్టీల నేత‌ల‌తోనూ మంత‌నాలు సాగించార‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ద్దె దించే దిశ‌గా బ‌లాన్ని కూడ‌గ‌ట్టేందుకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి టీఎమ్‌సీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో పాటు ఇత‌ర కాంగ్రెస్‌తో స‌హా ఇత‌ర పార్టీల‌ను ఒక్క‌తాటిపైకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కూట‌మికి శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వం వ‌హించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో దేశంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా కూటిమికి రంగం సిద్ధం చేస్తున్న శ‌ర‌ద్ ప‌వార్ ఇప్పుడు మోడీతో భేటీ కావ‌డం వెన‌క ర‌హ‌స్యం ఏమిట‌నే సందేహాలు రేకెత్తుతున్నాయి.

ఇటీల‌వ శ‌ర‌ద్ ప‌వార్ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పోటీచేస్తార‌నే ఊహాగానాలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేద‌ని ఈ మ‌హారాష్ట్ర నేత స్ప‌ష్ట‌త‌నిచ్చారు. మ‌రోవైపు మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్‌సీపీ, శివ‌సేన కూట‌మి (మ‌హావికాస్ అఘాడీ) ప్ర‌భుత్వ భాగ‌స్వామ్య ప‌క్షాల్లో విభేధాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఇంకోవైపు ఎన్‌సీపీ నేత‌లే లక్ష్యంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దాడులు, కేసులు ముమ్మ‌రం చేసిన నేప‌థ్యంలో రాజ‌కీయ చ‌తురుడైన ప‌వార్ మ‌న‌సులో ఏదో వ్యూహ‌మే ఉండ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ భేటీ వెన‌క ఎలాంటి రాజ‌కీయాలు లేవ‌ని, కేంద్రంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన స‌హ‌కార మంత్రిత్వ శాఖ గురించే వారు చ‌ర్చించార‌ని ఓ ఎన్‌సీపీ నాయ‌కుడు తెలిపారు.

మ‌హారాష్ట్రలోని చ‌క్కెర స‌హ‌కార సంఘాల ద్వారా భారీగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించ‌లేద‌నే ఆరోప‌ణ‌ల‌తో ఎన్‌సీపీ కీల‌క నేత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ స‌మీప బంధువుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. బ‌కాయిల చెల్లింపుల కోసం ఎన్‌సీపీ నేత‌ల‌పై ఒత్తిడి పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ‌కు అనుబంధంగా ఉండే స‌హ‌కార శాఖ‌ను ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ‌గా ఏర్పాటు చేయ‌డం హోం మంత్రి అమిత్ షాకు దాని బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం కూడా ప్ర‌ధానితో శ‌ర‌ద్ ప‌వార్ భేటీకి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎన్‌సీపీ నాయ‌కులు అనిల్ దేశ్‌ముఖ్‌, ఏక్‌నాథ్ ఖ‌డ్సేల‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఉచ్చు బిగుస్తుండ‌డంతో ఈ ప‌రిస్థితుల్లో బీజేపీ నేత‌ల‌తో సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకునే దిశ‌గా శ‌ర‌ద్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అనుమానాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశానికి సంబంధించిన వివిధ అంశాల‌పై మోడీపై చ‌ర్చించిన‌ట్లు శ‌ర‌ద్ ప‌వార్ చెప్తున్న‌ప్ప‌టికీ వీళ్ల మ‌ధ్య జ‌రిగిన ర‌హ‌స్య మంత‌నాల గురించి వాళ్ల‌కే తెలుసు.