Begin typing your search above and press return to search.

ఇలాంటి సీన్ త్రిపుర‌లోనే సాధ్యం!

By:  Tupaki Desk   |   10 March 2018 4:43 AM GMT
ఇలాంటి సీన్ త్రిపుర‌లోనే సాధ్యం!
X
రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. ఎవ‌రూ ఎల్ల‌కాలం అధికారంలో ఉండ‌లేరు. అధికార‌ప‌క్షం విప‌క్షంగా.. విప‌క్షం అధికార‌ప‌క్షంగా అవ‌త‌రించ‌టం స‌హ‌జ ప్ర‌క్రియ‌. అయితే.. ఈ వాస్త‌వాన్ని అర్థం చేసుకునే విష‌యంలో మ‌న రాజ‌కీయ పార్టీలు సిద్ధంగా లేవ‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అధికారం చేజారే వ‌ర‌కూ అధికార‌ప‌క్షం త‌మ‌కు మించిన తోపులు మ‌రెవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చేతులు పూర్తిగా కాలిపోతాయో అప్పుడు త‌త్వ్తం బోధ‌ప‌డుతుంది కానీ.. జ‌ర‌గాల్సిన డ్యామేజ్ అప్ప‌టికే జ‌రిగిపోయి ఉంటుంది.

గెలుపోట‌ముల్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌టం ఈ మ‌ధ్య‌న మ‌రింత పెరిగింది. గ‌తంలో అధికార‌ప‌క్ష నేత‌కు.. విప‌క్ష నేతకు మ‌ధ్య గౌర‌వ‌ప్ర‌ద‌మైన సంబంధం ఉండేది. దూకుడు రాజ‌కీయాల పుణ్య‌మా అని ఆ మర్యాద రేఖ ఇప్పుడు చెరిగిపోయింది. విజ‌యం సాధించినంత‌నే త‌మ‌కిక తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. విప‌క్షాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌టం.. ఎంత‌సేప‌టికి విప‌క్షానికి సంబంధించిన అధినేతల్ని టార్గెట్ చేయ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది. ఇందుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏం జ‌రుగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

కానీ.. ఇందుకు భిన్నంగా.. రెండు ద‌శాబ్దాల‌కు పైనే అధికారంలో ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. ఏళ్ల‌కు ఏళ్లుగా ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్న‌ప్ప‌టికీ అహంకారాన్ని.. అధికార బ‌లుపును ఎంత‌మాత్రం ప్ర‌ద‌ర్శించ‌ని నేత‌గా మాణిక్ స‌ర్కారును చెప్పాలి.

నిజాయితీకి నిలువెత్తు రూపంగా.. సాదాసీదాగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇప్ప‌టి కాలంలో ఇలాంటి ముఖ్య‌మంత్రులు ఉంటారా? అన్న భావ‌న క‌లిగించ‌టంలో మాణిక్ స‌ర్కార్ ఇప్ప‌టికి ముందుంటారు. అందువ‌ల్లే కావొచ్చు.. మ‌రే రాష్ట్రంలో చోటు చేసుకోని ఆస‌క్తిక‌ర దృశ్యం ఒక‌టి ఆవిష్కృత‌మైంది. త్రిపుర‌కు ఈ మ‌ధ్య‌న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాణిక్ స‌ర్కారు ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గ‌ల‌టం తెలిసిందే. త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ.. తాజాగా బీజేపీ ప్ర‌భుత్వం కొలువు తీరే వేళ‌.. ఆ కార్య‌క్ర‌మానికి ఆయ‌న్ను రావాల్సిందిగా కోరుతూ.. అధికార‌ప‌క్ష నేత‌లు ఆయ‌న్ను ప‌ర్స‌న‌ల్ గా క‌లిసి ఆహ్వానం ఇచ్చారు.

బీజేపీ నేత‌లు ఎంత ప‌ద్ధ‌తిగా పిలిచారో.. అంతే ప‌ద్ద‌తిగా కొత్త ప్ర‌భుత్వ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. పాతికేళ్ల వామ‌ప‌క్ష పాల‌న‌కు తెర దించుతూ.. బీజేపీ స‌ర్కారు తాజాగా కొలువు తీరింది. ఆ రాష్ట్ర ప‌దో సీఎంగా విప్ల‌వ్ కుమార్ దేవ్‌.. ఉప ముఖ్య‌మంత్రిగా జిష్ణు దేవ్ వ‌ర్మ‌న్ చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు.

ఈ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి ప్ర‌ధాని మోడీతో స‌హా బీజేపీ అగ్ర‌నేత‌లు అద్వానీ.. ముర‌ళీమ‌నోహ‌ర్ జోషితో పాటు.. కేంద్రంలోని ప‌లువురు ముఖ్య కేంద్ర‌మంత్రులు హాజ‌ర‌య్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మాజీ ముఖ్య‌మంత్రి మాణిక్ స‌ర్కారు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం పూర్తి అయి.. తిరిగి వెళుతున్న వేళ‌.. మాణిక్ స‌ర్కార్‌ కు ప్ర‌ధాని మోడీ క‌ర‌చాల‌నం చేయ‌టం.. ఆయ‌న్ను స్వ‌యంగా సాగ‌నంప‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఒక మ‌హానేత‌కు ఈ త‌ర‌హా వీడ్కోలు ఇవ్వ‌టం బాగుంది. అయితే.. ఇలాంటి సీన్ తెలుగు రాష్ట్రాల్లో ఆశించ‌టం అత్యాశే అవుతుంది. ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని గౌర‌వించ‌ని అధికార‌ప‌క్షం.. నిత్యం వారిపై రాజ‌కీయ విమ‌ర్శ‌లే త‌ప్పించి.. మ‌రేమీ లేని అధికార‌ప‌క్షాలున్న చోట త్రిపుర సీన్ రిపీట్ కావ‌టం అసాధ్యం.