Begin typing your search above and press return to search.

ఏపీ పోలీసులకు మోదీ ప్రశంసలు.. జగన్ నిర్ణయాల ఫలితమే

By:  Tupaki Desk   |   1 Nov 2019 9:10 AM GMT
ఏపీ పోలీసులకు మోదీ ప్రశంసలు.. జగన్ నిర్ణయాల ఫలితమే
X
గుజరాత్‌లో పోలీసు శాఖకు చెందిన ఓ ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల పోలీసులు స్టాల్స్ పెట్టగా అందులో ఏపీ పోలీసుల స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు.. ప్రధాని మోదీ ప్రశంసంలూ దక్కించుకుంది. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే తమకు ప్రశంసలు దక్కేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు.

గుజరాత్‌లోని వడోదరలో పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గురువారం ఈ ఎగ్జిబిషన్‌‌ను ప్రధాని సందర్శించారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. పోలీసు అధికారుల్ని అడిగి వివరాలు స్వయంగా తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీ పోలీస్ స్టాల్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఏపీ స్టాల్ దగ్గర ప్రత్యేక పోలీస్ విధానానికి సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. దీనిపై పూర్తిస్థాయి వివరాలు అందజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పోలీసు అధికారుల్ని కోరారు.

ప్రధాని ప్రశంసలు కురిపించడపై ఏపీ పోలీసు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం వినూత్నంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తోంది. ప్రయోగాత్మకంగా ముందు కొన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టగా విజయవంతం అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వీక్లీ ఆఫ్‌ల పద్దతి అమలవుతోంది. ఇక ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందన పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతుల్ని స్వీకరిస్తోంది.. ఆ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. స్పందన కార్యక్రమంలో భాగంగా పోలీసుశాఖ కూడా వారి పరిధిలోకి వచ్చే సమస్యల్ని పరిష్కరిస్తోంది. ఈ సంస్కరణలన్నీ జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన సూచన మేరకు అమలు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.