Begin typing your search above and press return to search.

మోడీ 'మన్ కీ బాత్'లో రామోజీ

By:  Tupaki Desk   |   25 Oct 2015 9:00 AM GMT
మోడీ మన్ కీ బాత్లో రామోజీ
X
ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో రామోజీరావు - కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుల ప్రస్తావన వచ్చింది. మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ వారిద్దరిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ - ఏపీల్లో ఈటీవీ-ఈ నాడు స్వచ్ఛ భారత్‌ ను ఉధృతంగా నిర్వహించాయని చెప్పిన మోడీ రామోజీ రావు వ్యక్తిగతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు 51 లక్షల మంది విద్యార్థులను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారన్నారు.

కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైనా ప్రశంసలు కురిపించారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడిని అశోక్ గజపతి రాజు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీల కృషిని మెచ్చుకున్నారు. ప్రధాని మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. మన్ కీ బాత్‌ లో భాగంగా ప్రసంగించిన మోడీ.... అవయవ దానంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య సేవలు అవయవాల మార్పిడిని సులభం చేశాయన్నారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా తమిళనాడు ముందు నిలిచిందన్నారు. కిడ్నీలు - గుండె - కాలేయం తదితరాల మార్పిడిలో తమిళనాట ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి ఎంతో సహాయం అందుతోందని, అవయవాలు సత్వరం చేరేందుకు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ముందుకు సాగాలన్నారు.

మొత్తానికి అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీకి రామోజీ తన స్వచ్ఛభారత్ పై భారీ రిపోర్టు ఇచ్చినట్లుగా ఉంది. అందుకే ఆయన అంత కచ్చితంగా 51 లక్షల మంది విద్యార్థులను భాగస్వాములను చేశారని చెప్పారు. అయితే... స్వచ్ఛభారత్ ఎంత చేసినా ఏపీకి పైసా విదల్చనట్లే రామోజీకి కూడా పద్మ భూషణ్ ఇవ్వడం అనుమానమేనని.. ఇప్పటికే అక్కడ లిస్టులో ఆయన పేరు గల్లంతైపోయిందని సమాచారం.