Begin typing your search above and press return to search.

మోడీ నోట ‘హంగ్’ మాట ఎందుకొచ్చింది?

By:  Tupaki Desk   |   9 March 2017 4:21 AM GMT
మోడీ నోట ‘హంగ్’ మాట ఎందుకొచ్చింది?
X
యూపీ సుదీర్ఘ పోలింగ్ సమాప్తమైంది. ఏడు దశల్లో సాగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల పోలింగ్ వ్యవహారం చికాకు పుట్టించేదే. దేశంలోనే అతి పెద్దరాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు వారాల తరబడి సాగాయని చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పుడు.. మూడు.. నాలుగు దశల పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలోనూ.. 300 సీట్లను కొల్లగొట్టే విషయంలోనూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.

అలా మాట్లాడుతున్న వారి జాబితాలో ప్రధాని మోడీ కూడా ఉండటం గమనార్హం. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు తమకు 300 సీట్లు పక్కా అంటూ మోడీ అండ్ కో నమ్మకంగా చెప్పారు. ఏడో విడత పోలింగ్ పూర్తి అయిన తర్వాత మొత్తంగా చూస్తే.. 60 శాతం ప్రజలు పోలింగ్ లో పాల్గొన్నట్లుగా తేలింది. ఇక.. ఆరేడు దశల పోలింగ్ వేళ.. ప్రధాని నోటి వెంట కీలకమైన వ్యాఖ్య ఒకటి వచ్చింది.

‘‘హంగ్ వస్తే జట్టు కట్టేందుకు మేనత్త.. మేనల్లుడు సిద్ధంగా ఉన్నారని.. అందుకే తిట్టుకోవటం మానేశారు’’ అంటూ మోడీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసినట్లైందని చెప్పాలి. 300 సీట్లు తమ ఖాతాలో పడిపోతాయన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసిన మోడీ పరివారం ఇప్పుడు అందుకు భిన్నంగా హంగ్ మాటల్ని ప్రస్తావించటంలో అంతర్యం ఏమిటన్న లోతుల్లోకి వెళితే.. పోలింగ్ సరళే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

యూపీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే 202 సీట్లు అవసరం. గతానికి భిన్నంగా ఈసారి యూపీలో త్రిముఖ పోటీ సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార ఎస్పీ.. కాంగ్రెస్ తో జతకట్టటంతో బీజేపీ.. బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ అనివార్యమైంది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేరుగా పోటీ చేయటంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. దీంతో.. కాంగ్రెస్ ఓట్లు చీల్చటంతో అంతిమంగా ఎస్పీ లాభపడింది.

అయితే.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండేళ్లకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనం పుణ్యమా అని యూపీలో భారీ సీట్లను బీజేపీ కొల్లగొట్టింది. అయితే.. నాటి వేవ్ నేడు లేకపోవటంతోనే.. మోడీ నోట సైతం.. హంగ్ మాట వచ్చినట్లుగా చెబుతున్నారు. 2014లోజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 లోక్ సభ నియోజకవర్గాల్లో అప్నాదళ తో కలిసి జతకట్టిన బీజేపీ ఏకంగా 73 స్థానాల్లో పాగా వేసింది. మొత్తంగా 42 శాతం ఓట్లును సాధించింది. ఇప్పుడు అదే మేజిక్ వర్క్ వుట్ అయ్యే పరిస్థితి లేకపోవటంతో.. కనీసం 35 శాతం ఓట్లు వచ్చినా అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పట్టణ ఓటర్లు.. యువకులు.. అగ్రవర్ణాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంటే.. యాదవ్- ముస్లిం ఓట్లుపై ఎస్పీఆశలు పెట్టుకుంటే.. జాతవ్ – ముస్లింల ఓటు బ్యాంకును మాయావతి నమ్మకుంది. ఇందులో భాగంగానే బీఎస్పీ ఏకంగా 100 మంది ముస్లిం అభ్యర్థులకు సీట్లు ఇవ్వటం గమనార్హం. అంటే.. ఎస్పీ.. బీఎస్పీ లలో ఏ పార్టీ పక్షాన ముస్లింలు ఉన్నారన్నది ఫలితాలపై తీవ్రప్రభావాన్ని చూపుతుందన్న అభిప్రాయం ఉంది.మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూపీలో హంగ్ కు అవకాశం ఉందన్నఅభిప్రాయం నెలకొంది. అయితే..ఇటీవల కాలంలో ప్రజల్లో సందిగ్థత ఏ మాత్రం లేదని.. ఏ పార్టీకి అధికారాన్ని అందించాలన్న విషయంపై ప్రజలు పూర్తి క్లారిటీతో ఉన్నట్లుగా చెబుతున్నారు. యూపీ అంతిమ ఫలితంపై మరింత స్పష్టతకు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతోకొంత సాయం చేస్తాయని చెప్పాలి. ఈ రోజు విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్.. పోలింగ్ ట్రెండ్స్ ను వెల్లడించే వీలుంది. ఇక.. యూపీతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలు (పంజాబ్.. గోవా.. ఉత్తరాఖండ్.. మణిపూర్) రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ శనివారం వెల్లడి కానున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/