Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆ ద‌ళిత నేత‌!

By:  Tupaki Desk   |   8 April 2017 5:15 AM GMT
రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆ ద‌ళిత నేత‌!
X
ఊహించ‌ని పేరు ఒక‌టి ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా పేర్కొంటూ తెర‌పైకి వ‌చ్చింది. ఇంత‌కాలం బీజేపీ కురువృద్దుడు అద్వానీ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా చెప్పుకోవ‌టం క‌నిపించింది. బీజేపీ అధినాయ‌క‌త్వం అద్వానీ పేరును అధికారికంగా పేరు ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ.. ఆయ‌న పేరిట సాగిన ప్ర‌చారాన్ని ఖండించ‌నూ లేదు. తాను రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో లేన‌న్న మాట‌ను అద్వానీ చెప్పిన కొన్ని గంట‌ల్లోనే ఒక ద‌ళిత నేత‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నియ‌మించేందుకు వీలుగా బీజేపీ అధినాయ‌క‌త్వం పావులు క‌దుపుతున్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీనికి బీజేపీతో పాటు.. సంఘ్ ప‌రివార్ నేత‌లు సైతం సానుకూలంగా ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అద్వానీ పేరును రీప్లేస్ చేస్తూ వినిపిస్తున్న పేరు విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ కు చెందిన ద‌ళిత నేత.. కేంద్ర‌మంత్రి థాప‌ర్ చంద్ గెహ్లాట్ పేరు వినిపించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉండ‌గా.. ఈ నెల 14న ప్ర‌ధాని మోడీ నాగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌ కూడా రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యాన్ని ఫైన‌లైజ్ చేసేందుకేన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ నాగ్ పూర్ లోని దీక్ష భూమిలో అంబేడ్క‌ర్ కు నివాళులు అర్పించ‌నున్నారు. అనంత‌రం సంఘ్ చీఫ్‌తో భేటీ కానున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి అభ్య‌ర్థిపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

సంఘ్ తో సుదీర్ఘ కాలంగా స‌న్నిహిత సంబంధాలున్న థాప‌ర్ చంద్‌ను త‌మ అభ్య‌ర్థిగా రేసులో నిలిపే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ద‌ళితుడ్ని రాష్ట్రప‌తిగా ఎంపిక చేయ‌టం ద్వారా.. తాము ద‌ళితుల‌కుపెద్ద‌పీట వేస్తున్నామ‌న్న సందేశాన్ని పెద్దఎత్తున పంపిన‌ట్లు అవుతుంద‌ని బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంబేడ్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా మోడీ పాల్గొన‌నున్న దీక్షాభూమిని ఎంచుకోవ‌టానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని చెప్పొచ్చు. హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీ మ‌రింత బలోపేతం కావ‌టానికి ఆ పార్టీకి దూరంగా ఉంటార‌న్న పేరున్న ద‌ళిత‌.. ముస్లిం వ‌ర్గాల్నిఆక‌ట్టుకోవ‌టం.. వారిని త‌మ ఓటుబ్యాంకుగామార్చుకోవ‌టం ద్వారా మ‌రింత కాలం అధికారంలో కొన‌సాగే వ్యూహంలో భాగంగా రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద‌ళిత‌నేత‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ఊహాగానాలుగా వినిపిస్తున్న ఈ పేరు ఫైన‌ల్ అయితే మాత్రం బీజేపీ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుక‌న్న‌ట్లు అవుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/