Begin typing your search above and press return to search.

ప్లీజ్ మోడీ..మెరుపుదాడుల్ని క్లెయిం చేసుకోవ‌ద్దు

By:  Tupaki Desk   |   26 Feb 2019 10:35 AM GMT
ప్లీజ్ మోడీ..మెరుపుదాడుల్ని క్లెయిం చేసుకోవ‌ద్దు
X
పుల్వామా ఉగ్ర‌దాడికి ప్ర‌తిగా భార‌త్ ప్ర‌తీకారం ఏస్థాయిలో ఉంటుంద‌న్న విష‌యాన్ని ఈ రోజు తెల్ల‌వారుజామున నిర్వ‌హించిన మెరుపుదాడుల‌తో ప్ర‌పంచానికి అర్థ‌మ‌య్యేలా చేసింది భార‌త స‌ర్కార్. త‌మ‌కు తాముగా ఎవ‌రి జోలికి రామ‌ని.. అదే స‌మ‌యంలో ఎవ‌రైనా త‌మ జోలికి వ‌స్తే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌న్న విష‌యాన్ని తాజా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ తో తేల్చి చెప్పింది భార‌త స‌ర్కారు.

మెరుపుదాడుల విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం మార‌ట‌మే కాదు.. వీర సైనికులకు ఘ‌న నివాళి దేశం ప‌లుకుతోంది. ఇదిలా ఉంటే.. మెరుపుదాడుల‌పై పాక్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. మ‌రి.. ఇలాంటి వేళ ప్ర‌ధాని మోడీ ఏం చేస్తున్నారు? ఎక్క‌డ ఉన్నారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు ఊహించ‌ని రీతిలో స‌మాధానం చెప్పాల్సిందే.

మెరుపుదాడుల్ని ప్ర‌త్య‌క్షంగా ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌వేక్షించిన‌ట్లుగా చెబుతున్న వేళ‌.. ఈ తెల్ల‌వారుజామున ఇంటికి వెళ్లిన ఆయ‌న‌.. ఈ మ‌ధ్యాహ్నం రాజ‌స్థాన్ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మెరుపుదాడుల్ని ప్ర‌స్తావించారు. దేశం మేల్కొని ఉంద‌ని.. ప్ర‌తి భారత పౌరుడికి విజ‌యం ల‌భిస్తుంద‌న్నారు.

దేశం సుర‌క్షితమైన చేతుల్లో ఉంద‌న్న ఆయ‌న‌.. ఈ వేకువ జామున నియంత్ర‌ణ రేఖ దాటి పాక్ లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై వైమానిక దాడుల్ని త‌న‌దైన శైలిలో ప్ర‌స్తావించారు.

"ఈ దేశం సుర‌క్షిత‌మైన చేతుల్లో ఉంద‌న్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి.. జాతికి ఎన్న‌టికి త‌ల‌వంపులు తీసుకురాను. స‌గ‌ర్వ భార‌తావ‌ని త‌ల ఎత్తుకునే ఉంటుంది. ఈ దేశ గౌర‌వ మ‌ర్యాద‌ల‌ను మంట‌గ‌లిపే ప‌నులు ఎప్ప‌టికి చేయ‌ను. జాతి ప్ర‌యాణం ఆగ‌దు. ఈ జాతి విజ‌య‌యాత్ర కొన‌సాగుతూనే ఉంటుంది. వ్య‌క్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్ప‌ద‌నే భావ‌న‌తో ప‌ని చేస్తున్నామ‌న్నారు. జాతి నిర్మాణంలో భాగ‌స్వామ్యులైన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌ధాన సేవ‌కుడిలా న‌మ‌స్క‌రిస్తున్నా" అని వ్యాఖ్యానించారు. మోడీ మాట‌లు బాగానే ఉన్నా.. తాజా మెరుపు దాడుల విజ‌యం త‌మ ఖాతాకు మ‌ర‌ల్చుకునేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మెరుపు దాడుల విజ‌యాన్ని భార‌త వైమానిక ద‌ళం విజ‌యం కింద ఉంచితే మంచిది. అంత‌కు మించి ఎవ‌రూ దాన్ని త‌మ ఖాతాలోకి వేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌టం చాలా అవ‌స‌రం. ఈ విష‌యాన్ని మోడీ గుర్తిస్తారా? అన్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాలి.