Begin typing your search above and press return to search.

ఒక్క‌డి ఎఫెక్ట్ః మోడీ మంత్రుల మార్పు

By:  Tupaki Desk   |   19 May 2016 9:53 AM GMT
ఒక్క‌డి ఎఫెక్ట్ః మోడీ మంత్రుల మార్పు
X
సర్బానంద సోనోవాల్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేప‌థ్యంలో అసోంలో బీజేపీ విజయం సాధిస్తే పార్టీ ముఖ్యమంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన సీనియ‌ర్ నాయ‌కుడు. ఇపుడు ఈయ‌న వ‌ల్ల ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌న కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలోనే పునర్ వ్యవస్థీకరించాల్సి రానుంది!

సర్బానంద సోనోవాల్ ప్రస్తుతం కేంద్ర‌ యువజన సర్వీసులు - క్రీడల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో అసోంలో బీజేపీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఆయ‌న సీఎం పీఠంపై కూర్చోనున్నారు. ఈ నేప‌థ్యంలో సోనోవాల్ కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవలసి ఉంటుంది. దీంతో ఆయన రాజీనామాతో ఏర్పడే ఖాళీని భర్తీ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఒక్క‌రితోనే స‌రిపుచ్చ‌కుండా మరికొందరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

నరేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు - చేర్పులు ఉంటాయ‌ని చెప్తున్నారు. అయితే ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుంటారని వారంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎన్నికల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకోసం గట్టి నాయకులను రంగంలోకి దించాలనుకుంటున్నారనీ వివ‌రిస్తున్నారు. ఈ లెక్క‌ల్లో భాగంగా ఆయన ఆరోగ్య శాఖ మంత్రి జె.డి.నడ్డా - పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ - చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ - వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లను మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీలోకి తీసుకుంటారనే మాట వినిపిస్తోంది. అలాగే ఒకరిద్దరు సీనియర్లతోపాటు కొందరు జూనియర్ మంత్రులకు కూడా ఉద్వాసన పలకవచ్చునని అంటున్నారు.