Begin typing your search above and press return to search.

పంజాబ్ సీఎం పై మోడీ ప్రతీకారం మొదలైంది..

By:  Tupaki Desk   |   18 Jan 2022 9:14 AM GMT
పంజాబ్ సీఎం పై మోడీ ప్రతీకారం మొదలైంది..
X
పంజాబ్ పర్యటనలో తనను 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ లో చిక్కుకునేలా చేసిన పంజాబ్ సీఎం పై ప్రధాని మోడీ ప్రతీకారం మొదలైంది. తాజాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీపై అక్రమ మైనింగ్ కేసులు నమోదు కావడం సంచలనమైంది. భూపిందర్ ఇంటితోపాటు పంజాబ్ లోని మరో 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిపింది.

పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ మేనల్లుడిపై అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించి ఈడీ దాడులు చేపట్టింది. పలు కేసులు నమోదు చేసిన ఈడీ సీఎం చన్నీ మేనల్లుడి ఇంటితోపాటు పంజాబ్ లోని మరో 10 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం సోదాలు చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం మేనల్లుడి ఇంటిపై ఈడీ దాడులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనమైంది.

ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈడీ భూపిందర్ సింగ్ హనీపై కేసు నమోదు చేసింది. భూపిందర్సింగ్ పై ఈడీ దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే దాడులు చేయడం ఇది బీజేపీ కుట్ర అని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ను ఎన్నికల్లో దెబ్బ తీయడానికే కేంద్రప్రభుత్వం కావాలనే ఈ ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి రాజకీయ సంబంధాలు ఉన్న పలువురిని విచారిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు. పంజాబ్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న క్రమంలో ఈ అక్రమ ఇసుక తవ్వకాలు చర్చనీయాంశమైంది. అధికార కాంగ్రెస్ కు వ్యాపారాలతో సంబంధాలున్నాయని మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు.

ఇప్పటికే పంజాబ్ లో కాంగ్రెస్ కు గట్టి సవాల్ గా మారిన ఆప్ పార్టీ సీఎం చన్నీని తన నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆరోపణలపై కూడా లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనుండడంతో పంజాబ్ లో తీవ్రమైన ప్రచారానికి మధ్యలో ఈ దాడులు కలకలం రేపుతున్నాయి.