Begin typing your search above and press return to search.

మోడీ ఏపీకి డైరెక్టుగా దెబ్బేశాడు

By:  Tupaki Desk   |   31 July 2016 9:07 AM GMT
మోడీ ఏపీకి డైరెక్టుగా దెబ్బేశాడు
X
రాజ్య‌స‌భ సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చేచెప్పిన ఉదంతం ఇంకా ర‌గులుతుండ‌గానే మ‌రో షాకింగ్ న్యూస్ వినాల్సి వ‌చ్చింది. ఈ ద‌ఫా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రూపంలో ఈ షాక్ ఎదురు అవుతుండ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో ఉన్న ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో తెరపైకి వచ్చిన నీతీఅయోగ్‌ కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చైర్మ‌న్ అనే సంగ‌తి తెలిసిందే. నీతీ ఆయోగ్ ద్వారా ఏపీకి పెద్ద ఎత్తున ఆర్థిక స‌హాయం అందుతున్నాయ‌ని ఆంధ్రులు ఆకాంక్షించారు. కానీ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో నీతీ ఆయోగ్‌ పై పెట్టుకున్న ఆశలు మృగ్యం అవుతున్నాయని తేలింది.

గ‌తవారం ఢిల్లీలో నీతీ ఆయోగ్ ఆధ్వ‌ర్యంలో స‌మ‌వేశం నిర్వ‌హించ‌గా రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు ఆ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. నీతి ఆయోగ్‌ ద్వారా విభజిత రాష్ట్రానికి అదనపు నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని - ఖర్చులు కూడా గణనీయంగా పెరిగిపోయాయని అధికారులు అనేక రూపంలో కేంద్రానికి వివరించారు. ఇదే సమయంలో కొత్త రాష్ట్రంలో ఏర్పాటుచేయాల్సిన అనేక పథకాలపై కూడా వివరిస్తూ నిధులు కావాలని అభ్యర్ధించారు. అయితే అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే కేటాయింపులు చేసేందుకు నీతీ అయోగ్‌ సిఫార్సులు చేసిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా రాష్ట్రాల అవసరాలపై సంప్రదించిన తరువాతే సిఫార్సులు చేయాల్సి ఉన్నప్పటికీ, ఈసారి అటువంటి ప్రక్రియ లేకుండానే సిఫార్సులు చేసినట్లు అర్ధిక శాఖ అధికారులు చెప్తున్నారు. దీనివల్ల అదనపు నిధులు రాకుండా పోయినట్లు కూడా అధికారులు అంటున్నారు.

తాజా సమావేశంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్న పథకాల మంచి చెడ్డలపైనే నీతిఅయోగ్‌ దృష్టి పెట్టిందని, వాటిపైనే చర్చ పెట్టిందని సమాచారం. ఏయే రాష్ట్రాల్లో ఏయే పథకాలు అమలు చేస్తున్నారు - వాటికి సంబంధించిన నిధులపై చర్చించారు. వాటిల్లో ఏయే పథకాలు బాగున్నాయన్న కోణంలో నీతి ఆయోగ్ అధికారులు ఆరా తీశారు. అంతే తప్ప ఇతర కీలక అంశాలు - రాష్ట్రాల ప్రత్యేక అవసరాలపై చర్చ జరగలేదని అధికారులు అంటున్నారు. అసలు మాటమాత్రంగానైనా తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా నేరుగా నివేదికలు ఇవ్వడం, సిఫార్సులు చేయడంపై రాష్ట్ర అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం - నీతి ఆయోగ్ రూపంలో అదనపు నిధులు వస్తాయని ఆశిస్తున్న రాష్ట్రానికి ఎదురుదెబ్బ తగులుతోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.