Begin typing your search above and press return to search.

ప్రపంచ బ్యాంకులో కీలక పదవి దక్కించుకున్న మోడీ సెక్రటరీ

By:  Tupaki Desk   |   5 Jun 2020 9:10 AM GMT
ప్రపంచ బ్యాంకులో కీలక పదవి దక్కించుకున్న మోడీ సెక్రటరీ
X
దేశాన్ని తన కనుసన్నలతో నడిపిస్తున్న అధినేతగా ప్రధాని మోడీని చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రధానమంత్రులుగా పని చేసిన వారిలో ఆయనే అత్యంత శక్తివంతుడు. అలాంటి మోడీ దగ్గర సెక్రటరీగా పని చేయటం మాటలు కాదు. అత్యంత శక్తివంతమైన ఆ ఉద్యోగంలో ఉన్న వారు.. వేరే ఉద్యోగం గురించి ఆలోచిస్తారా? అంటే లేదనే మాటే వినిపిస్తుంది. కానీ.. ఆ స్థానంలో పని చేసే వారి ఆలోచనలు ఎలా ఉంటాయనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పాలి.

ప్రధాని మోడీకి ప్రైవేటు సెక్రటరీగా వ్యవహరిస్తున్న రాజీవ్ టోప్నో తాజాగా తన పదవిని విడిచిపెట్టారు. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కు సీనియర్ సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జన్మించిన ఆయన 1974లో పుట్టారు. గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారిగా 1996లో నియమితులైన ఆయన.. అంచలంచెలుగా ఎదుగుతూ మన్మోహన్ హయాంలో పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. రాజీవ్ ను తన టీంలోకి తీసుకున్నారు. ప్రైవేటు కార్యదర్శిగా నియమించుకున్నారు. మోడీ అంచనాలకు తగ్గట్లే విధినిర్వహణలో ఆయన తన మార్కును వేసుకోగలిగారు. తాజాగా ఆయనకు ప్రపంచ బ్యాంకులో కీలక పదవిని వరించింది. ప్రధాని మోడీకి ప్రైవేటు సెక్రటరీగా పని చేసే వ్యక్తి.. వేరే ఆఫర్ వచ్చిందని వెంటనే వెళ్లిపోలేరు. అలాంటి వారికి ప్రధాని నేతృత్వంలోని అపాయింట్ మెంట్స్ కమిటీ క్లియరెన్సు తప్పనిసరి. తాజాగా.. అది కూడా క్లియర్ అయినట్లు చెబుతున్నారు. మొత్తంగా మోడీ టీంలోని ఒక కీలక అధికారికి మరో కీలకమైన పదవిని వరించటం గమనార్హం. తాజాగా లభించిన పదవిలో ఆయన మూడేళ్లు పని చేయనున్నారు.