Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీల‌ను 3 ల‌క్ష‌ల‌కు త‌గ్గొద్ద‌న్న మోడీ

By:  Tupaki Desk   |   24 March 2018 9:08 AM GMT
బీజేపీ ఎంపీల‌ను 3 ల‌క్ష‌ల‌కు త‌గ్గొద్ద‌న్న మోడీ
X
సంప్ర‌దాయ రాజ‌కీయ‌నేత‌ల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టంలో మోడీ త‌ర్వాతే ఎవ‌రైనా. ఆయ‌న ఆలోచ‌న‌లు ఇప్ప‌టి నేత‌ల తీరుకు అస్స‌లు పోలిక ఉండ‌దు. సోష‌ల్ మీడియాను ఎంత‌లా వాడుకోవాలో.. సాంకేతిక‌త సాయంతో ఇమేజ్ ను ఎంత‌లా పెంచుకోవాలో ఆయ‌న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ ఇమేజ్ ను భార‌తావ‌నికి వ్యాప్తి చేయ‌టంతో బీజేపీ ప్ర‌చారం విష‌యంలో అనుస‌రించి డిజిట‌ల్ వ్యూహం బ్ర‌హ్మాండంగా వ‌ర్క్‌వుట్ అయ్యింద‌ని మ‌ర్చిపోకూడ‌దు. ఇదిలా ఉండ‌గా.. సోష‌ల్ మీడియా ఇప్పుడు మ‌రింత కీల‌కంగా మార‌ట‌మే కాదు..ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉండ‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో త‌మ పార్టీ ఎంపీలు చురుగ్గా ఉండాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు మోడీ. అంతేనా.. ఒక్కో బీజేపీ ఎంపీ త‌క్కువ‌లో త‌క్కువ 3 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ను ట్విట్ట‌ర్ లో ఉంచుకునేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ ల‌క్ష్యాన్ని నిర్దేశించారు.

బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం సంద‌ర్భంగా పార్టీ ఎంపీల‌ను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడిన మోడీ.. టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంటూ ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌జేయాల‌ని.. ప్ర‌తిప‌క్షాలు వినిపించే క‌ట్టుక‌థ‌లు.. అబ‌ద్ధాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొట్టాల‌న్నారు.

సామాన్యుల‌కు వ‌చ్చే సందేహాల్ని ఎప్ప‌టికిప్పుడు తీర్చ‌టంలో అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని వ్యాఖ్యానించారు. త‌న ప్ర‌సంగంలో అధిక భాగంగా సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకొని ఎలాంటి ప్ర‌చారాన్ని సాగించాల‌న్న అంశంపై సుదీర్ఘంగా ప్ర‌సంగించిన‌ట్లు చెబుతున్నారు.

ఓట‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ఆన్ లైన్ ను ఎలా ఉప‌యోగించుకోవాలో చెప్పిన మోడీ.. మ‌రింత బాగా అర్థ‌మ‌య్యేందుకు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. 2014 నుంచి ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలను అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్న‌ట్లు చెప్పారు.

బీజేపీ ఎంపీల్లో మొత్తం 43 మంది ఎంపీల‌కు ఫేస్ బుక్ ఖాతాలు లేవ‌న్న ఆయ‌న‌.. ఫేస్ బుక్ ఖాతాల్ని ఉప‌యోగిస్తున్న వారిలో 77 అకౌంట్ల‌కు ఇంకా వెరిఫికేష‌న్ పూర్తి కాలేద‌న్న విషయాన్ని ప్ర‌స్తావించారు. చూస్తుంటే.. 2019 ఎన్నిక‌ల్లో మోడీ అండ్ కో సోష‌ల్ మీడియా మీద భారీగా ఆధార‌ప‌డిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మ‌రి.. డిజిట‌ల్ జీవులు మోడీ స‌ర్కారుపై ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.