Begin typing your search above and press return to search.

అంతలా తిట్టేసినా మన్మోహన్ కు మోడీ ప్రశంస

By:  Tupaki Desk   |   25 Nov 2016 7:30 AM GMT
అంతలా తిట్టేసినా మన్మోహన్ కు మోడీ ప్రశంస
X
కొన్ని అంశాలు వినేందుకే విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఏదైనా అంశం మీద ఇద్దరి మధ్య చర్చ జరిగి.. అది శ్రుతి మించితే.. ఇద్దరి మధ్య అప్పటివరకూ ఉన్న మంచి సంబంధం కాస్తా పోయి.. అభిప్రాయబేధాలు ఇరువురి మధ్యా అగాధాన్ని పెంచే పరిస్థితి. బాగా తెలిసినవారుసైతం సిద్ధాంతాల పరంగా భిన్న ధ్రువాలుగా ఉంటే వారి మధ్య మాటల యుద్ధం నిత్యం సాగుతుంటంది. తిట్టుకోవటం మామూలే.కొన్నిసార్లు ఇది కాస్తా ముదిరిపోతే లేనిపోని సమస్యలు ఎదురయ్యే పరిస్థితి.

కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరించే ధోరణి అత్యున్నత స్థానంలో ఉండే కొందరిలో కనిపిస్తుంది. అలాంటి వైఖరే వారిని ఆ స్థానంలో నిలిపించా? అన్న భావన కలుగుతుంది. తాజాగా తాను తీసుకున్న నోట్ల రద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడినతీరు.. మోడీ సర్కారు నిర్ణయంపై ఆయన ఫైర్ అయిన తీరు తెలిసిందే.

మేధావిగా.. ఆర్థికవేత్తగా పేరు ప్రఖ్యాతులున్న మన్మోహన్ సింగ్.. రద్దుపై రాజ్యసభలో చేసిన ప్రసంగాన్ని మీడియా ప్రముఖంగా ప్రచురించింది. మన్మోహన్ మాట్లాడే సమయంలో సభలోనే ఉన్న ప్రధాని మన్మోహన్ ఆయన చెప్పిన మాటలన్నింటిని జాగ్రత్తగా విన్న వైనం లైవ్ టీవీలు చూసిన వారికి స్పష్టంగా తెలుస్తుంది. తనను.. తాను తీసుకున్ననిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ ను.. ప్రధాని మోడీ ప్రశంసించటం గమనార్హం. గురువారం రాజ్యసభ భోజన విరామ సమయంలో మోడీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దుపై మాట్లాడిన మన్మోహన్ సింగ్ తీవ్రంగా తప్పు పట్టారు. రద్దుతో సామాన్యుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తీసుకొచ్చారు. రద్దు నిర్ణయాన్ని తాను వ్యతిరేకించటం లేదు కానీ.. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టటం గమనార్హం.

మన్మోహన్ మాటల్ని శ్రద్ధగా విన్న ప్రధాని మోడీ.. సభకు విరామం ప్రకటించిన తర్వాత మన్మోహన్ వద్దకు వెళ్లి.. ఆయన మాటల్ని ప్రశంసించటమేకాదు.. ఆయన చేసిన సూచనల్నిపరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అదే.. రీతిలో మిగిలిన విపక్ష నేతల్ని ఆయన పలుకరించటం గమనార్హం. విధానాల పరంగా వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. నేతల మధ్య సహృద్భావ వాతావరణం ఉండటం శుభసూచకంగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/