Begin typing your search above and press return to search.

జిన్నా కుమార్తెకు ముంబయిలో ఇంటిని ఇవ్వాలట!

By:  Tupaki Desk   |   30 Sep 2016 2:19 PM GMT
జిన్నా కుమార్తెకు ముంబయిలో ఇంటిని ఇవ్వాలట!
X
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తనకు మాత్రమే సాధ్యమయ్యేలా వ్యాఖ్యలు చేసే బీజీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి తాజాగా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఆయన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వామి వ్యాఖ్య విన్నంతనే.. ఈ పెద్ద మనిషి ఏమిటిలా మాట్లాడారన్న భావన రావటం ఖాయం. అయితే ఆయన ట్వీట్ ను పూర్తిగా చదివితే అసలు విషయం అర్థం కావటమే కాదు.. పాకిస్థాన్ కు పంచ్ ఇవ్వటానికి స్వామి మరో మార్గాన్ని సూచిస్తున్న భావన కలగటం ఖాయం.

దేశాన్ని ముక్కలు చేసిన జిన్నా కుమార్తెకు ముంబయిలోని ఇంటిని ఇవ్వాలని స్వామి ఎందుకు ఇవ్వమన్నారన్న విషయంలోకి వెళితే.. కాస్త ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలి. జిన్నా కుమార్తె దీనా వాడియా.. తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పార్శీ వ్యక్తి అయిన నెవిల్లెను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పాకిస్థాన్ కు వెళ్లకుండా దీనా ముంబయిలోనే సెటిల్ అయ్యింది. అయితే.. తన కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవటంతో ఆగ్రహం చెందిన జిన్నా.. దీనా తన కూతురే కాదని తేల్చేశాడు.

ఈ ఇష్యూ ఇలా ఉంటే.. మళ్లీ జిన్నా దగ్గరకు వెళితే.. స్వాతంత్ర్యానికి పూర్వం ఇంగ్లాండ్ వెళ్లిన జిన్నా.. భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత 1936లో ముంబయిలోని సౌత్ కోర్టు అనే పేరుతో పెద్ద భవనాన్ని కట్టుకున్నారు. ఇక్కడి నుంచే ముస్లిం లీగ్ కార్యకలాపాల్ని చేపట్టారు. అనంతరం దేశ విభజన కోసం పోరాడిన ఆయన.. విభజన తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిపోవటం తెలిసిందే. తన తండ్రి భవనాన్ని తనకు కేటాయించాల్సిందిగా గతంలో దీనా భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. పాకిస్థాన్ లో ఉండటానికి ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించని జిన్నా కుమార్తె.. తనకు తన తండ్రి ఇంటిని ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు.

ఈ విషయంలో స్వామి ఎంట్రీ ఎందుకు వచ్చిందన్న డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. ముంబయిలోని జిన్నా ఇంటిని వాజ్ పేయ ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ సందర్శించిన నాటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జిన్నా ఇంటిని పాకిస్థాన్ కు అప్పగించాల్సిందిగా కోరారు. దీంతో.. ఆయన కోరిక మేరకు.. ఇప్పుడా భవనంలో పాక్ దౌత్య కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాక్ అధీనంలో ఉన్న ఈ భవనాన్ని లండన్ లో ఉన్న జిన్నా కుమార్తె దీనాకు అప్పగించటం ద్వారా.. ఆ భవనం నుంచి పాక్ దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేయించాలన్నది స్వామి ఆలోచనగా చెప్పొచ్చు. వేరే ఎలా చేసినా అంత సరిగా ఉండదు. అదే.. జిన్నా కూతురికే ఈ భవనాన్ని అప్పగించేస్తే.. పాక్ సైతం నోరు విప్పే అవకాశం ఉండదన్నది స్వామి ఆలోచనగా చెబుతున్నారు.