Begin typing your search above and press return to search.

అసలు సంగతి వదిలి అన్నీ మాట్లాడిన మోడీ

By:  Tupaki Desk   |   1 Jan 2017 6:15 AM GMT
అసలు సంగతి వదిలి అన్నీ మాట్లాడిన మోడీ
X

పెద్ద నోట్లను రద్దు చేసిన నాటి మోడీ ప్రసంగం గుర్తుందా..? దేశమంతా తెల్లగా మారిపోతుందని ఆయన బొమ్మ చూపించారు.. ఆ రోజు ప్రధాని ఇచ్చిన గడువు మొన్నటితోనే పూర్తయింది. డిసెంబర్‌ 30 వరకు గడువు ఇవ్వండి ఈ దేశాన్ని మార్చి చూపిస్తా అంటూ నవంబర్‌ 8న భీకర గర్జనలు చేసిన మోడీ… శనివారం రాత్రి తన ప్రసంగంలో ఆ అంశాల జోలికే వెళ్లలేదు. ఎంత నల్లధనం బయటకు వచ్చింది?, దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగబోతోంది? వంటి వాటిపై మోదీ స్పష్టత ఇస్తారని అంతా భావించారు. ప్రజలకు కొత్త ఏడాది కానుకగా బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తారని ఊహించారు. అయితే శనివారం రాత్రి జాతినుద్దేశించి సుదీదర్ఘంగామాట్లాడిన మోడీ తుస్సుమనిపించారు. నల్లధనం ఏమైంది... ఎంత తెల్లగా మారింది వంటి సంగతుల జోలికే పోలేదు.

నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం బయటకు వచ్చింది?. పెద్దనోట్ల రద్దు వల్ల పలాన ఉపయోగం జరిగిందన్న విషయాలేవీ మోడీ తన ప్రసంగగంలో చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే ఎలక్షన్ మీటింగులో మాట్లాడినట్లు తాను అమలు చేయబోయే కొన్ని పథకాలను అనౌన్సు చేసి పక్కదారి పట్టించారు.

రుణాలు తీసుకున్న రైతులకు తొలి రెండు నెలల వడ్డీ మాఫీ చేస్తున్నట్టు వెల్లడించారు. రైతులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నగరాల్లో ఇళ్ల నిర్మాణానికి రెండు పథకాలను మోదీ ప్రకటించారు. 9లక్షలకు లోపు ఇంటి నిర్మాణానికి 4శాతం వడ్డీ తగ్గిస్తున్నట్టు చెప్పారు, 12 లక్షల లోపు ఇంటి నిర్మాణానికి మూడు శాతం వడ్డి తగ్గిస్తున్నట్టు మోడీ చెప్పారు. దేశంలో అనవసరంగా ఎక్కువ నోట్లను ముద్రించారని గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు చేశారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు నల్లధనం మీదే ఆధారపడి బతుకుతున్నారని ఆరోపించారు. కొత్త ఏడాదిలో బ్యాంకింగ్ వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. దేశంలో కేవలం 24 లక్షల మంది మాత్రమే తమ ఆదాయం ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువ అని ఒప్పుకుంటున్నారని మోడీ చెప్పారు. ఇకపై ప్రతి పైసా పైనా నిఘా ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా మోడీ పలు వరాలు ప్రకటించారు. పౌష్టికాహారం, టీకాల కోసం గర్భిణీల ఖాతాలో రూ. 6వేలు జమ చేస్తామన్నారు. రైతులకు కొత్తగా 20వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తామన్నారు. ఆర్థిక భారాన్ని దృష్టిలోఉంచుకుని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలంతా భీమ్ యాప్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్సుడు డిపాజిట్ల కాల వ్యవధి పదేళ్ల కంటే ఎక్కువ ఉంటే 8 శాతం వడ్డీ ఇస్తామని ప్రకటించారు. మొత్తం మీద మోడీ ప్రసంగంలో గర్భిణీలకు ఆరు వేలు ఇస్తామన్నది మాత్రమే హైలైట్ పాయింట్‌. మిగతా అంతా సాదాసీదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/