Begin typing your search above and press return to search.

కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా బహిరంగ సభలో మోడీ మాట్లాడింది ఇదే!

By:  Tupaki Desk   |   4 July 2022 1:39 AM GMT
కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా బహిరంగ సభలో మోడీ మాట్లాడింది ఇదే!
X
సహనానికి పరీక్ష అన్నట్లుగా అడుగడుగునా షాకులు ఇచ్చిన తెలంగాణ అధికారపక్షం.. సభ నిర్వహణ దగ్గర నుంచి సభకు సంబంధించిన ప్రచారానికి సైతం అవకాశం ఇవ్వకుండా చేసిన గులాబీ దండు కమలనాథులకు ఉక్కిరిబిక్కిరి చేసిందనే చెప్పాలి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఒకరోజు ముందు.. కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధించటం తెలిసిందే. అన్నేసి ప్రశ్నలు సంధించిన సీఎం కేసీఆర్ కు మోడీ ఎలాంటి కౌంటర్ ఇస్తారన్న ఆసక్తి అందరిలో వ్యక్తమవుతున్న వేళ.. సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ ఒక్కటంటే ఒక్క సందర్భంలోనూ కేసీఆర్ పేరును ప్రస్తావించకుండానే తన ప్రసంగాన్ని పూర్తి చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అందురు అనుకున్నది చేస్తే మోడీ ఎందుకు అవుతారన్న మాటకు తగ్గట్లే ఆయన తాజా తీరు ఉందని చెప్పాలి. కేసీఆర్ మీద ఘాటు విమర్శలు తప్పవన్న అంచనాకు భిన్నంగా ప్రధాని మోడీ వ్యవహరించారనే చెప్పాలి. విజయ సంకల్ప సభ పేరుతో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో భారీ జన సందోహాన్ని ఉద్దేశించి.. మోడీ మాట్లాడిన మాటల్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే.. తమ ప్రభుత్వం చేస్తున్న డెవలప్ మెంట్ ను.. తెలంగాణకు తాము చేస్తున్న పనుల గురించి.. నిధుల గురించి చెప్పుకొచ్చారు. ప్రత్యర్థులపై ఒక్క విమర్శ చేయకుండా తన మౌనంతో కొత్త సందేహాలకు తెర తీశారు.మోడీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- తెలంగాణలో బీజేపీపై రోజురోజుకూ అభిమానం.. విశ్వాసం, మద్దతు పెరుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతు ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఇది రెట్టింపు అయ్యింది. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు తప్పక వస్తుంది.

- ట్టణాలతోపాటు తెలంగాణలోని ప్రతి పల్లె అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తాం! అందరినీ సమ దృష్టితో చూస్తాం! ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం పని చేస్తాం! తెలంగాణ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళతాం. దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉందో తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీపై తెలంగాణ ప్రజలకు ఎన్నో రెట్లు నమ్మకం పెరిగింది.

- మీ ప్రేమాభిమానాలు, ఉత్సాహాన్ని దేశ ప్రజలంతా చూస్తున్నారు. తెలంగాణలోనూ బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకం తెలంగాణలోని ప్రతి పేదవారికి, దళితులకు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలకు, మధ్యతరగతి వర్గాలకు అందాయని, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పడితే పట్టణాలతోపాటు గ్రామాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి.

- వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తే.. ప్రతి కుటుంబానికి న్యాయం చేశాం. దేశ ప్రజలతోపాటు తెలంగాణలోని కోట్లాది మందికి వేగంగా.. ఉచితంగా టీకా అందించాం. దేశ ప్రజలతో పాటు తెలంగాణలోని పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశాం. వైద్యాన్ని ఉచితంగా అందించాం.

- భారత్‌లో పరిశోధన, సృజనాత్మకతకు తెలంగాణ కేంద్రంగా ఉంది. కరోనా సమయంలో హైదరాబాద్‌లోనే టీకాలను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను ఈ టీకాలు కాపాడాయి. హైదరాబాద్‌లో పరిశోధన, సృజనాత్మకతకు అనువైన వాతావరణాన్ని ఈ ఎనిమిదేళ్లలో ఏర్పాటు చేశాం.

- హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్‌ సిటీని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేషనల్‌ యానిమల్‌ రిసెర్చ్‌ సౌకర్యం, బయో మెడికల్‌ రిసెర్చ్‌, ఆధునిక పరిశోధన కేంద్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. సాంకేతికత, సృజనలకే పరిమితం కాకుండా పేద, గ్రామీణ కుటుంబాలకు చెందిన యువతీ, యువకుల ప్రతిభను కూడా ప్రోత్సహిస్తున్నాం.

- నూతన విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషల్లో చదువు చెప్పించాలని నిర్ణయించాం. తెలుగులో టెక్నాలజీ, వైద్య విద్యను అభ్యసించే అవకాశం దొరికితే అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల కలలు నిజమవుతాయి. 21వ శతాబ్దంలో నారీమణులను శక్తిమంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశంలో తొలిసారి పురుషుల కన్నా మహిళల జనాభా పెరిగింది.

- ఇక్కడికి పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు.. సోదరీమణులు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. మీ ప్రేమ, ఉత్సాహం అర్థం చేసుకుంటున్నా. మా ప్రభుత్వం మహిళలు, యువతులు, అమ్మాయిల ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసింది.

- స్వచ్ఛ భారత్‌తో గౌరవప్రదమైన జీవితాన్ని అందించాం. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసే మహిళల ప్రాతినిథ్యం పెంచాం. తద్వారా, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర పెరిగింది. బ్యాంకులను మహిళలతో అనుసంధానం చేశాం. జనధన్‌ యోజన కింద దేశంలో 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే.. వాటిలో కోటికిపైగా ఖాతాలు తెలంగాణలోనే ఉన్నాయి. ముద్ర రుణాల్లో మహిళల వాటా పెరిగింది.

- 2015లో తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు రూ.6,500 కోట్లను కేటాయించాం. ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించాం. దీనివల్ల విదేశాల నుంచి ఎరువులు దిగుమతి చేసుకునే పరిస్థితి తగ్గనుంది.

- ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా 5ఎఫ్‌లను అమలు చేస్తున్నాం. ఫామ్‌ టు ఫైబర్‌.. ఫైబర్‌ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్‌.. ఫ్యాషన్‌ టు ఫారిన్‌. ఈ నినాదంతోనే టెక్స్‌టైల్‌ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తాం.టెక్స్‌టైల్‌ పార్కులతో రైతులకు మేలు కలుగుతుంది. వ్యాపారాలు మెరుగుపడతాయి. వేలాదిమంది యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.

- తెలంగాణలో రైతుల ఆదాయం మెరుగుపరిచాం. నీటిపారుదల రంగంలో 5 ప్రాజెక్టులకు రూ.35 వేల కోట్లకుపైగా నిధులు ఇస్తున్నాం. ఆరేళ్లలో రూ.లక్ష కోట్ల విలువ చేసే వరిధాన్యం కొనుగోలు చేశాం. వరి రైతులకు రెండింతలు డబ్బులు ఇచ్చాం. ఈ ఏడాది ధాన్యం కనీస మద్దతు ధరను రూ.80పెంచి రూ.2000కుపైగా చేశాం.