Begin typing your search above and press return to search.

మన్మోహన్ కలను నిజం చేసిన మోడీ

By:  Tupaki Desk   |   26 Dec 2015 5:04 AM GMT
మన్మోహన్ కలను నిజం చేసిన మోడీ
X
ఒకరు కల కన్నారు. ఆ కలను విన్న వారు అది సాధ్యమేనా? అన్న ప్రశ్న దగ్గరే ఆగిపోయారు. కల కన్న వ్యక్తి అయితే దాన్ని సాధించుకోవటం ఎలా అన్న ప్రయత్నం చేసింది లేదు. కానీ.. కలను విన్న మరో వ్యక్తి మాత్రం ప్రయత్నించటమే కాదు.. అసలు ఇదో పెద్ద విషయం కాదని తేల్చేశారు. కల కన్నది మాజీ ప్రధాని మన్మోహన్ అయితే.. ఆ కల సాధ్యమా అని మిగిలిన రాజకీయ పక్షాలు అనుకుంటే.. అదేమీ పెద్ద కష్టం కాదు.. ఎంత సింఫులో తెలుసా అంటూ చేసి చూపించారు ప్రధాని నరేంద్రమోడీ.

ఇంతకీ మాజీ ప్రధాని మన్మోహన్ కలేమిటంటే.. ‘‘అమృత్ సర్ లో అల్పాహారం.. లాహోర్ లో మధ్యాహ్నం భోజనం.. కాబూల్ లో రాత్రి విందు చేయాలి. మా పూర్వీకులు అలా జీవించారు. నా మనమళ్లు అలానే జీవించాలన్నదే నా కల’’ అంటూ 2007 జనవరిలో ఢిల్లీలోని ఫిక్కీ కార్యక్రమంలో ప్రధాని హోదాలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి పదేళ్లు ప్రధానిగా ఉన్న ఆయన.. తన కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేశారా? అన్నది ఒక ప్రశ్న.

అయితే.. అందరి మాదిరే మన్మోహన్ కలను విన్న(?)మోడీ మాత్రం ఆ కలను పూర్తి చేశారు. కాకుంటే చిన్న మార్పుతో అది కూడా రివర్స్ లో. మన్మోహన్ అమృత్ సర్ నుంచి మొదలు పెడితే.. మోడీ మాత్రం రష్యా నుంచి మొదలు పెట్టి ఢిల్లీతో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం రష్యాలోని మాస్కో నుంచి ‘టీ’తో బయలుదేరిన ఆయన టిఫిన్ కు కాబూల్ కు చేరుకున్నారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రానికి లాహోర్ కు చేరుకొని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో విందు పూర్తి చేశారు. రాత్రికి బయలుదేరి ఢిల్లీకి చేరుకొన్నారు. ఒకే రోజు మూడు దేశాల్లో గడిపి.. స్వదేశానికి చేరుకున్న ఘనతను మోడీ సొంతం చేసుకున్నారు. కల కనటం గొప్ప కాదు.. ఆ కలను ఎలా సాకారం చేసుకోవాలో ప్రయత్నించి విజయం సాధించటమే గొప్ప. ఆ విషయంలో మోడీ మొనగాడన్న విషయం మరోసారి నిరూపితమైంది.