Begin typing your search above and press return to search.

మోదీ టార్గెట్ వోటింగ్ క్లాస్..మిడిల్ క్లాస్ కాదు

By:  Tupaki Desk   |   2 Feb 2018 8:07 AM GMT
మోదీ టార్గెట్ వోటింగ్ క్లాస్..మిడిల్ క్లాస్ కాదు
X
అందరు రాజకీయ నాయకులు వేరు - మోదీ వేరు. అందుకే తాజా బడ్జెట్లోనూ మోదీ మార్కు కనిపించింది. అందరికీ ఈ బడ్జెట్ ఒకలా కనిపిస్తే మోదీకి మరోలా దీన్ని చూస్తున్నారట. అసలు మోదీ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన కోణంలో ఇది సక్సెస్ ఫుల్ బడ్జెట్ అని చెప్పుకోవాలి. తనది కానిది - తనకు అవకాశం లేని దానికోసం మోదీ ఎక్కువ ఆయాసప్రయాసలు పడరు. జస్ట్ ఒక రాయి వేసి చూస్తారంతే. మోదీ పక్కా ప్రాక్టికల్ పర్సన్ అన్న సంగతి తెలిసిందే.

ఇంతకీ ఇదంతా ఎందుకంటే... 2019 ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న అత్యంత కీలకమైన బడ్జెట్ అయినప్పటికీ మోదీ ఈ దేశంలోని అతి పెద్ద వర్గమైన మధ్య తరగతికి ఎలాంటి తాయిళాలు లేకుండా చప్పని బడ్జెట్ విడుదల చేశారు. ఇలాంటి రుచీపచీ లేని బడ్జెట్ తో ఎన్నికల్లో మోదీ ఏం సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ... బీజేపీకి చిరకాలంగా అండాదండగా ఉన్న వర్గాలు ఏంటి - ఇప్పుడు కొత్తగా బీజేపీ పట్టు పెంచుకుంటున్న సెక్షన్లు ఏంటి అన్నది పరిశీలిస్తే మోదీ బడ్జెట్ ఆయనకు 100 శాతం అనుకూలూమనే చెప్పాలి.

దక్షిణ భారతదేశంలో మోదీ అంటే క్రేజ్ ఉన్నా అది బీజేపీకి ఓట్లేసేటంతటి స్థాయిలో లేదు. కానీ, ఉత్తరాదిలో పరిస్థితులు వేరు. బీజేపీ బలంగా ఉంది. మరీ ముఖ్యంగా హిందూత్వ భావజాలం దిగువ మధ్యతరగతి వర్గాల్లో బలంగా నాటుకుంది. అదే సమయంలో ఉత్తరాది ఉన్నత వర్గాల్లోనూ మోదీ పట్ల సానుకూలత ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ - ఇండస్ర్టీ అనుకూల బడ్జెట్ ఉన్నత వర్గాలను ఆకట్టుకుంటుండగా... ఆరోగ్య బీమా వంటిది పేదలను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టింది. ఈ బీమా సంగతిని పేద వర్గాలు ఇప్పటికిప్పుడు అర్థం చేసుకోలేకపోయినా ఈ ఏడాది కాలంలో దాని పవరేంటో చూపించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏపీలో ఒకప్పుడు ఆరోగ్య శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డిని హీరోని చేసినట్లు ఈ జాతీయ ఆరోగ్య పథకాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలన్నది మోదీ ప్రణాళికగా తెలుస్తోంది.

మధ్య తరగతి ఎలాగూ తనకు అంత అనుకూలం కాదు కాబట్టి - తనను ఆదరించని వారికి తాను ప్రయారిటీ ఇవ్వడం కంటే తన వెన్నంటి ఉన్నవారికి ప్రయారిటీ ఇచ్చే లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను గుర్తు చేసుకుంటే మోదీ మైండ్ సెట్ - వ్యూహం రెండూ అర్థమవుతాయి. యూపీ ఎన్నికలంటే ప్రతి పార్టీ ముస్లిం ఓటు బ్యాంకుపైనే కన్నేస్తుంది. కానీ, మోదీ రివర్సులో వచ్చారు. తనకు ఆ ఓట్లు పడవు అనుకున్నప్పుడు దాని కోసం ఎందుకు ప్రయత్నించాలి అన్నట్లుగా ఆయన పార్టీ టిక్కెట్లు కూడా ముస్లింలకు ఇవ్వలేదు. కేవలం ఒక్కరికే ఇచ్చారు. మొత్తంగా హిందూ ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకునే ప్రచారం చేసి ఎన్నికలను నడిపించి సూపర్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు కూడా మోదీ వ్యూహం దాదాపుగా అంతే. తనకు బలమున్న ఉత్తరాది ఫ్యాక్టర్లే ప్రాతిపదికగా ఈ బడ్జెట్ తయారుచేశారు.