Begin typing your search above and press return to search.

‘రద్దు’ మైనస్ ను ప్లస్ గా మార్చుకునే అవకాశం?

By:  Tupaki Desk   |   23 Nov 2016 4:18 AM GMT
‘రద్దు’ మైనస్ ను ప్లస్ గా మార్చుకునే అవకాశం?
X
కష్టంలో సుఖం.. సమస్యలో పరిష్కారం.. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటం అందరికి సాధ్యం కాదు. కొందరు మాత్రమే ఈ తరహా ఆలోచనలు చేస్తారు. అలాంటి వారికి విజయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. పెద్దనోట్ల రద్దుపై సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ పుణ్యమా అని.. గడిచిన15 రోజులుగా ప్రజలు చిల్లరనోట్ల కోసం తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఏదో రెండు మూడు రోజులు.. మహా అయితే వారం రోజుల్లో సమస్య ఒక కొలిక్కి వస్తుందని భావించినా.. ఈ ఇబ్బంది మరికొంత కాలం సా..గుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.

బ్యాంకులు.. ఏటీఎం కష్టాలతో కిందా మీదా పడుతున్న ప్రజల్లో కొందరు.. రద్దు కారణంగా మంచి జరుగుతుందన్న భావనలో ఉంటే.. మరికొందరు మాత్రం అలాంటిదేమీ ఉండదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాజకీయపక్షాలు మోడీ తీసుకున్న నిర్ణయంపై అగ్గి ఫైర్ అవుతున్నాయి. తమ వాదనకు అసరాగా ప్రజలు పడుతున్న కష్టాల్ని పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. దీంతో కేంద్ర సర్కారు సైతం ఆత్మరక్షణలో పడింది.

ఇదిలా ఉంటే.. రద్దు నిర్ణయం కారణంగా ప్రజలకు కష్టాలే కాదు.. లాభాలు చాలా ఉన్నాయన్న భావన కలిగేలా కేంద్రం కొన్ని చర్యల్ని వెనువెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వివిధ రంగాలు ప్రభావితం కావటం కచ్ఛితమన్నది తెలిసిందే. నల్లధనానికి చెక్ పెట్టే ఈ చర్యతో ఎప్పుడో ఏదో లాభం వస్తుందన్నది కాకున్నా.. ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఉపశమనాల్ని ప్రకటించటం ద్వారా మోడీ సర్కారు ప్రజల మనసుల్ని గెలుచుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆగ్రహం తగ్గేలా.. రద్దు నిర్ణయంతో తమకెంతో ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? మోడీ అండ్ కో ఎలాంటి నిర్ణయాల్ని ప్రకటించాలన్న అంశాన్ని చూస్తే.. కొందరు సూచిస్తున్న మార్గాలు బాగున్నాయన్న భావన కలగటం ఖాయం. అలాంటి సూచనల్ని కొన్నింటిని చూస్తే..

= తక్షణం రూ.500.. రూ.100 నోట్లు విరివిరిగా అందుబాటులోకి వచ్చేలా చేయటం.

= ఏటీఎంలు పని చేసేలా చూడటం.

= బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొన్ని మార్పులు చేయటం.

= పెళ్లిళ్లు లాంటి వేడుకల కోసం నగదు కష్టాలు ఎదురుకాకుండా చూడటంతో పాటు.. ఆన్ లైన్ చెల్లింపులపై అవగాహన పెరిగేలా ప్రచారం ముమ్మరం చేయటం

= ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేయటంతో పాటు.. ఆదాయ పన్ను మినహాయింపును పెంచటం.. పన్ను పోటును పెద్ద ఎత్తున మార్పులు చేస్తూ కీలక నిర్ణయాన్ని వెలువరించటం.

= పెట్రోలు.. డీజిల్ మీద ఉండే పన్ను భారాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించటం.

= వ్యాపార లావాదేవీలకు ఇబ్బందిగా మారిన చిల్లరకష్టాలపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టిని సారించటం.

= మెడికల్ షాపుల్లో పాత నోట్ల చెలామణి అయ్యేలా నిర్ణయం తీసుకోవటం. అలా అని ఆ నిర్ణయం కారణంగా నల్లధనం మార్చుకునే అవకాశం కలగకుండా పరిమితులు విధిస్తూ.. వెసులుబాటు కల్పించటం

= పెట్రోల్ బంకుల్లో పాత నోట్ల అనుమతిని డిసెంబరు 30 వరకు పొడిగించటం

= బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రస్తుతం రూ.2లక్షలు మించిన లావాదేవీలకు పాన్ అవసరం. దాన్నిరూ.5లక్షలకు పెంచేలా నిర్ణయం తీసుకోవటం.

= వీటితో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సాయంగా.. ప్రజలకు పాతనోట్ల రద్దు కారణంగా ఏర్పడే ఇబ్బందులకు తమ వంతు సాయంగా కృషి చేయటం. ఉదాహరణకు.. పల్లెల నుంచి కూరగాయలు.. పండ్లు.. పువ్వులు లాంటి వాటి రవాణాకు సంబంధించి బస్సుల్లో చార్జీలులేకుండా అనుమతించటం లాంటివి చేయటంతో పాటు.. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బస్సు పాసుల ధరల్ని పెద్దఎత్తున తగ్గించటం ద్వారా.. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వీలైనంత ఎక్కువగా వినియోగించేలా చర్యలు తీసుకోవటం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/