Begin typing your search above and press return to search.

క్రెడిట్ కేసీఆర్‌ దే..మోడీ మ‌దిలో రైతుబంధు

By:  Tupaki Desk   |   3 Jan 2019 4:38 AM GMT
క్రెడిట్ కేసీఆర్‌ దే..మోడీ మ‌దిలో రైతుబంధు
X
గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ సీఎం కేసీఆర్ సార‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు - రైతు బీమా పథకాలు పలు రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. రైతాంగ సమస్యల పరిష్కారానికి కీలక అంశాలుగా నిలిచిన తెలంగాణ రైతుబంధు పథకాన్ని ఇప్పటికే ఒడిశా - జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించాయి. ఒడిశా ప్రభుత్వం కాలియా పేరిట పథకాన్ని ప్రకటించగా.. తాజాగా దేశంలోని కీలక రాష్ట్రంగా ఉన్న పశ్చిమబెంగాల్ కూడా తెలంగాణ బాటలోనే పయనించింది.రాష్ట్రంలోని 72 లక్షల మంది రైతులకు లబ్ధికూర్చేలా ఏటా ఎకరానికి ఐదువేల ఆర్థికసాయం అందించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. క్రిషక్ బంధు పేరిట ఈ సాయాన్ని రెండు విడుతల్లో అందిస్తామని తెలిపారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఇదే ఆలోచ‌న‌తో ఉంద‌ని స‌మాచారం. రైతులకు ఒక్కో సీజన్‌ లో రూ.4 వేల చొప్పున ఇచ్చేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని ప్రారంభించడంతో పాటు అన్నదాతలకు వడ్డీ లేకుండా లక్ష రూపాయల వరకు రుణాలను అందజేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయని బిజినెస్ టుడే పత్రిక పేర్కొంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా లోక్‌ సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోడీ ప్రభుత్వం ఈ వారంలోనే రెండు పథకాలను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటనను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని కార్యాలయంతో పాటు నీతి ఆయోగ్‌ లో అత్యవసర సమావేశాలను నిర్వహించనుంది. సంబంధిత శాఖలకు చెందిన అధికారులు సమావేశమై ఈ పథకాల అమలులో అవరోధాలు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం కోరింది. అలాగే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ప్రధాని మోదీ రైతు సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు. 4 వేల చొప్పున ఆర్థిక స‌హాయం - ఎక‌రాకు రూ. ల‌క్ష రుణం పథకాలకు సాలీనా రూ.2.3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకాలను అమలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఎరువులపై రైతులకు ఇస్తున్న రూ.70 వేలకోట్ల సబ్సిడీని వీటిలో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా, రైతుల అభివృద్ధికి వివిధ దేశాల్లో అమలవుతున్న 20 వినూత్న పథకాల జాబితాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు - రైతుబీమా పథకాలు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు చేపడుతున్న 20 వినూత్న పథకాల్లో వీటికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది. ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపింది. అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌తినిధులు ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించారు. ఇటు అంత‌ర్జాతీయ వేదిక‌లో ప్ర‌శంస పొంద‌డం మ‌రోవైపు దేశంలో వివిధ రాష్ర్టాల పాల‌కుల‌కు ఆద‌ర్శంగా త‌మ ప్ర‌భుత్వం ప‌థ‌కం మార‌డంతో టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్గాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.