Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ‘లక్ష’ మందికి మోడీ మాట

By:  Tupaki Desk   |   1 Aug 2016 5:36 AM GMT
హైదరాబాద్ లో ‘లక్ష’ మందికి మోడీ మాట
X
తాను వెచ్చించే ప్రతి నిమిషానికి అంతకు వందల రెట్లు ప్రయోజనం కలిగేలా జాగ్రత్తలు తీసుకునే తత్వం ప్రధాని మోడీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తాను వెళ్లే ప్రతిచోటా భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన పాతిక నెలల తర్వాత రాష్ట్రానికి తొలిసారి వస్తున్న మోడీ.. తన పర్యటనకు సంబంధించిన భారీ ప్రయోజనాన్ని పొందాలని భావిస్తున్నారు. అందుకే.. తమ పార్టీ నేతృత్వంలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల ఏడున తెలంగాణ పర్యటనకు రానున్న ఆయన.. తొలుత గజ్వేల్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారని భావించారు. తాజాగా అందుకు భిన్నంగా ఆయన భారీ బహిరంగ సభకు ఓకే చెప్పారు. రాక రాక వస్తున్నప్రధానికి ఘన స్వాగతం పలకటంతో పాటు.. పలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ భావించినా.. అలాంటి వాటికి పీఎంవో నో చెప్పేసింది. అయితే.. తన మాట పెద్ద ఎత్తున ప్రజలకు చేరే అవకాశం ఉంటే నో చెప్పేలని మోడీ తీరుకు తగ్గట్లే.. తెలంగాణ బీజేపీ.. ఎల్ బీ స్టేడియంలో ఒక భారీ సభను ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు.

గజ్వేల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే మోడీ.. అనంతరం హైదరాబాద్ లోపార్టీ కార్యక్రమంలో పాల్గొనడటం విశేషం. ఎల్ బీ స్టేడియంలో గంట గడిపేందుకు మోడీ ఓకే చెప్పారని.. ఈ గంటలో అరగంటకు తక్కువ కాకుండా మోడీ ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ఈ సభ కోసం భారీ జనసమీకరణ బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య కార్యకర్తల్ని ఆహ్వానించాలని భావిస్తున్నారు. లక్షకు పైగా జన సమీకరణతో సభను ఏర్పాటు చేయటం ద్వారా తెలంగాణలో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని తర్వాత తన పార్టీ కార్యక్రమంలో భాగంగా భారీ సభలో పాల్గొనటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్తంత చికాకు తెప్పించటం ఖాయమంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమంలో మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? పార్టీ చేపట్టిన భారీ సభలో మోడీ నోటి నుంచి తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారటం ఖాయం.