Begin typing your search above and press return to search.

మోడీ పే..ద్ద తప్పు చేశారా?

By:  Tupaki Desk   |   5 Aug 2016 4:49 AM GMT
మోడీ పే..ద్ద తప్పు చేశారా?
X
దేశ రూపురేఖల్ని మార్చేసే వీలున్న బిల్లుగా అభివర్ణిస్తూ.. 1991 తర్వాత దేశంలో ఆర్థికాంశాలకు సంబంధించిన అత్యంత కీలకమైన ములుపుగా అభివర్ణిస్తున్న జీఎస్టీ బిల్లు రాజ్యసభలో సవరణలతో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే.. బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సభా ధిక్కారణకు పాల్పడ్డారా? అన్న ప్రశ్న రేకెత్తేలా కాంగ్రెస్ విమర్శలు ఎక్కు పెట్టటం గమనార్హం. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన వేళ.. మోడీ వ్యవహరశైలిని తీవ్రంగా తప్పుపడుతోంది కాంగ్రెస్ పార్టీ.

ప్రతిష్ఠాత్మకమైన బిల్లును ఆమోదించే సమయంలో పార్లమెంటు ఉభయ సభలకు హాజరు కాకుండా ప్రధాని మోడీ సభా ధిక్కారానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ఆరోపిస్తున్నారు. విప్లవాత్మకమైన బిల్లుగా చెబుతున్న బిల్లు ఆమోదం పొందే వేళ ప్రధాని మోడీ ఐదు నిమిషాలు కూడా సభకు కేటాయించలేకపోయారా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ తీరు శోచనీయమంటూ మోడీ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పు పట్టారు జైరాం.

ఈ అంశాన్ని సాపేక్షంగా చూస్తే.. జీఎస్టీ బిల్లు ఆమోదం విషయంలో మోడీ వ్యవహరించిన తీరును నిశితంగా గమనిస్తే.. ఆయన ఆచితూచి అడుగులు వేసినట్లుగా కనిపిస్తుంది. ప్రతిష్ఠాత్మకమైన బిల్లు ఏకగ్రీవం తమ ఘనతగా మోడీ ఎక్కడా పేర్కొనకుండా జాగ్రత్తపడ్డారు. మెజార్టీ లేని రాజ్యసభలో 217 మంది సభ్యులతో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పలకటం అంత తేలికైన విషయం కాదు. దాని వెనుక ఎంతో వ్యూహాత్మక కసరత్తు జరిగిన విషయాన్ని కొట్టి పారేయలేం. ప్రతిపక్షాల ఇగోను సంతృప్తి పరుస్తూ.. గడిచిన 16 ఏళ్లుగా చేయలేని పనిని తాను పూర్తిచేసినా.. ఆ విషయాన్ని గొప్పగా అభివర్ణించుకోకుండా.. ఎన్డీయే సర్కారు ఘనతగా ప్రచారం చేసుకోకుండా.. ‘‘అందరి విజయం’’ అన్నట్లుగా మోడీ వ్యవహరించటం కనిపిస్తుంది.

అందుకేనేమో.. రాజ్యసభకు హాజరై.. బిల్లు గురించి మాట్లాడటం.. విపక్షాలకు అవకాశం ఇచ్చే కన్నా.. తన పరోక్షంగా బిల్లు ఆమోదం పొందటం ద్వారా.. క్రెడిట్ అందరికి ఇచ్చే ఉద్దేశంతో మోడీ హాజరు కాలేదన్న మాట వినిపిస్తోంది. కానీ.. ఆ విషయాన్ని రాజకీయం చేయటమే లక్ష్యమన్నట్లుగా జైరాం మాటలే ఉన్నాయి. కీలక బిల్లు ఆమోదం పొందే వేళ మోడీ సభలో లేకపోవటాన్ని ఇంత తీవ్రంగా తప్పు పడుతున్న జైరాం.. ఏపీ విభజన బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు తలుపులు మూసేసి.. టీవీల్లో లైవులు కట్ చేసి మరీ.. ఎలాంటి చర్చ లేకుండా నిమిషాల్లో బిల్లు పాస్ చేయటాన్ని ఏమంటారు? ఆ విషయంలో నాటి ప్రధానిని.. అప్పటి అధికారపక్షం చేసిన దాంతో పోలిస్తే.. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందే వేళ సభలో లేకపోవటం మహాపరాధం అవుతుందన్నట్లుగా మాట్లాడటం అర్థం లేనిదిగా చెప్పొచ్చు. తప్పులన్నీ తమ ప్రత్యర్థుల విషయంలోనే జైరాం అండ్ కోలకు కనిపిస్తాయేంటి చెప్మా..?