Begin typing your search above and press return to search.

ఈ దెబ్బ‌తో మోడీ మోత మోగించేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   12 March 2017 6:07 AM GMT
ఈ దెబ్బ‌తో మోడీ మోత మోగించేస్తార‌ట‌
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. రెండు రాష్ర్టాల్లోనూ తిరుగులేని మెజారీటీతో బీజేపీ అధికారం చేపట్టనుండటంతో.. కేంద్రంలో మోడీ సర్కారు బలం మరింత పెరుగనుంది. దాంతో ప్రధాని మోడీ.. భవిష్యత్‌లో పెద్ద నోట్ల రద్దు లాంటి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు మరిన్ని షాకింగ్ నిర్ణయాలు వినేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని వారంటున్నారు. గత ఏడాది నవంబర్‌ లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అమలు తీరుపై సామాన్య వర్గాల నుంచి వ్యక్తమైన అసంతృప్తి తాజా ఎన్నికల ఫలితాల్లో అంతగా ప్రతిబింబించలేదు. దీంతో మున్ముందు మోడీ మరిన్ని వివాదాస్పద చర్యలు చేపట్టేందుకు ఈ పరిణామం బాటలు వేసే అవకాశం ఉందని అంటున్నారు.

పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ కేవలం ఆరంభమేనని, మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటామని గతంలో మోడీ ప్రకటించడం కూడా తాజా విశ్లేష‌ణ‌ల‌కు బలాన్ని చేకూరుస్తున్నది. పెద్ద నోట్ల రద్దు అనంతరం మోడీ సర్కారు బినామీ ఆస్తుల చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఉత్తర ప్రదేశ్‌ లో విజయ ఢంకా మోగించడంతో మున్ముందు ప్రతిపక్ష నాయకుల బినామీ ఆస్తులను సైతం టార్గెట్ చేసే అవకాశం ఉంది. తాజాగా మరో రెండు రాష్ర్టాల్లో పాగా వేయడంతో మున్ముందు రాజ్యసభలో ఎన్‌ డీఏ బలం మరింత పెరుగనుంది. పలు ఆర్థిక సంస్కరణల అమలుకు ఎగువ సభలో సరైన మెజారీటీ లేక ఇన్నాళ్లూ సతమతమైన మోడీ సర్కారుకు ఇక మార్గం సుగమమైనట్లే. రాజ్యసభలో ఎన్‌ డీఏ బలం పెరిగితే సునాయసంగా బిల్లులను గట్టెక్కించగలిగే వీలుంటుంది. అంటే కీలక బిల్లులకు ఆమోదం పొందేందుకు కాంగ్రెస్‌ తో రాజీపడాల్సిన అవసరం ఉండదన్నమాట. దీంతో ఉత్తర ఉత్తేజంతో త్వరలోనే మరిన్ని సాహసోపేతమైన సంస్కరణలకు మోడీ సర్కారు తెరలేపవచ్చు. కిరోసిన్ - విద్యుత్ వంటి ప్రభుత్వ సబ్సిడీలన్నింటినీ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, బ్యాంకింగ్ లావాదేవీలపై పన్ను - వ్యక్తిగత ఆదాయ పన్నును పూర్తిగా లేదా పరోక్షంగా ఎత్తివేయడం వంటి వివాదాస్పద నిర్ణయాలను ప్రకటించవచ్చని అంచనా. అలాగే, దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలను - లోక్‌ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదనను సైతం అమలులోకి తెచ్చే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, ఉత్తర ప్రదేశ్‌ లో విజయం సాధించడంతో మోడీ సంస్కరణల జోరు ఇక ఊపందుకోనుందని పారిశ్రామిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అంతేకాదు - కేంద్రం - రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం, అవగాహన మరింత మెరుగుపడనుందని వారన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ లో స్థానిక పార్టీలతో పొత్తు అవసరం లేకుండా అధికారాన్ని చేపట్టడం ఎన్‌డీఏ ప్రభుత్వానికి బాగా కలిసివచ్చే అంశమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/