Begin typing your search above and press return to search.

తమిళనాడుకు మరో దేశాధినేతను తీసుకురానున్న మోడీ?

By:  Tupaki Desk   |   30 Oct 2019 5:00 AM GMT
తమిళనాడుకు మరో దేశాధినేతను తీసుకురానున్న మోడీ?
X
తాము ఒకసారి టార్గెట్ చేస్తే.. దాన్ని సాధించే వరకూ వెనక్కి తగ్గని మైండ్ సెట్ మోడీషాల సొంతం. తాము పాగా వేయాలనుకున్న రాష్ట్రంలో ఏదో ఒకటి చేసి.. అక్కడి ప్రజల మనసుల్ని దోచేసుకోవటం వారికి అలవాటే. దీనికి తగ్గట్లే పలు రాష్ట్రాల్ని టార్గెట్ చేసి.. అక్కడి ప్రజల మనసుల్ని దోచేసి.. వారి అభిమానంతో అధికారాన్ని చేపట్టిన వైనం ఇప్పటికే చూశాం.

తామెంత ప్రయత్నించినా కొరుకుడుపడని దక్షిణాదిని టార్గెట్ చేసిన మోడీషాలు.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఎత్తుగడతో రానున్న నాలుగేళ్ల వ్యవధిలో పాగా వేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. విమర్శల్ని పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్నారు. తమిళనాడును టార్గెట్ చేసిన మోడీషా.. అక్కడి అధికారపక్షమైన అన్నాడీఎంకేకు అభయహస్తాన్ని ఇవ్వటం తెలిసిందే.

అదే రీతిలో ఏపీకి.. తెలంగాణకు వేర్వేరు ప్లానింగ్ చేసిన మోడీషాలు.. తమిళ ప్రజల మనసుల్ని దోచుకోవటానికి భారీగానే ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న చైనా అధ్యక్షుడు భారత్ లో రెండు రోజులు పర్యటించగా.. ఆ రెండు రోజుల్ని తమిళనాడులో ఉండేలా ప్లాన్ చేయటమే కాదు.. మహాబలిపురం కేంద్రంగా సాగిన పర్యటన మొత్తం తమిళుల మనసుల్ని దోచుకోవటమే లక్ష్యంగా మోడీ వ్యవహరించారు.

చైనా అధ్యక్షుడి పర్యటన తర్వాత తమిళుల్లో మోడీ పట్ల కాసింత సానుకూలత లభించిందన్న మాట వినిపిస్తోంది. దీన్ని మరింత పెంచేందుకు వీలుగా వచ్చే ఏడాది జనవరి (2020)లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ఆయన టూర్ మొత్తాన్ని తమిళనాడు కేంద్రంగా ఉండేలా మోడీ ప్లాన్ చేస్తున్నారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. గతంలో మరే కేంద్రప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వనంత ప్రాధాన్యత తాము మాత్రమే ఇస్తున్నామన్న భావన కలిగేలా మోడీ వ్యవహరిస్తున్నారు.

జనవరిలో పుతిన్ పర్యటన సందర్భంగా తమిళనాడులో ఫేమస్ జల్లికట్టు క్రీడను ఈ ఇరు దేశాధినేతలు స్వయంగా వీక్షిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. తమిళనాడు ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకునే జల్లికట్టు క్రీడను పుతిన్ తో కలిసి చూడటం ద్వారా.. తమిళ సంప్రదాయాల విషయంలో తమ ప్రభుత్వం ఎంత కమిట్ మెంట్ తో ఉందన్న విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పినట్లు అవుతుందని చెబుతున్నారు. మరికొద్ది నెలల్లో జరిగే పుతిన్ పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకున్నా.. తమిళనాడు కేంద్రంగానే ఆయన టూర్ సాగే అవకాశం ఉందంటున్నారు.